* ప్రగతి నగర్ గ్రామపంచాయతీలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు.
* గ్రామ సందర్శనలో అనుమతిలేని భవన నిర్మాణాన్ని గుర్తించిన మంత్రి, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం.
* గతంలో పనిచేసిన గ్రామ కార్యదర్శి మనోహర్, ప్రస్తుత కార్యదర్శి మౌలాన లపై సస్పెన్షన్ వేటు.
* గతంలో పనిచేసిన ఈఓ పీఆర్ అండ్ ఆర్డీ మల్లారెడ్డి, ప్రస్తుత ఈఓ పీఆర్ అండ్ ఆర్డీ జ్యోతిలకు చార్జీ మెమో జారి చేయాలని ఆదేశం.
* అనుమతిలేని నిర్మాణాలు, అక్రమ లే అవుట్ ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరిక.
* గ్రామాల్లో పన్నుల విధానంపై సమీక్షిస్తాం.. సీఎం కేసీఆర్ గారితో చర్చించి నూతన పన్నుల విధానానికి రూపకల్పన చేస్తాం: జూపల్లి
* గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్క్, స్విమ్మింగ్ పూల్, క్రీడా మైదానాలు, కమ్యూనిటీ హాల్ పరిశీలన… నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి
* గ్రామంలోని మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్వహణపై ప్రశంస.. ఇతర గ్రామపంచాయతీలు కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మంత్రి.
హైదరాబాద్: మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లాలోని ప్రగతినగర్ గ్రామ పంచాయతీని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ సందర్శన సందర్భంగా అనుమతి లేకుండా నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించడాన్ని మంత్రి గుర్తించారు. కళ్ల ముందే యధేచ్చగా నిర్మాణం జరుగుతున్న పట్టించుకోని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో గ్రామ కార్యదర్శిగా పనిచేసిన మనోహర్, ప్రస్తుత కార్యదర్శి మౌలానాలపై అక్కడికక్కడే సస్పెన్షన్ వేటు వేశారు.అలాగే ప్రస్తుత ఈఓ పీఆర్ అండ్ ఆర్డీ జ్యోతి, గతంలో పనిచేసిన ఈఓ పీఆర్ అండ్ ఆర్డీ మల్లారెడ్డికి ఛార్జీ మెమోలు ఇవ్వాలని డీపీఓ సురేష్ ను ఆదేశించారు. పంచాయతీల్లో అనుమతిలేని నిర్మాణాలు, అక్రమ లే అవుట్ లకు అధికారులదే బాధ్యత అని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి జూపల్లి హెచ్చరించారు. ప్రగతి నగర్ లోని అనుమతి లేని నిర్మాణాలు, అక్రమ లే అవుట్ లకు సంబంధించి వారం రోజుల్లో నివేదిక అందజేయాలని… బాధ్యులను గుర్తించాలని ఆదేశించారు. అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవన నిర్మాణాలను వెంటనే ఆపివేయాలని అన్నారు. పర్యవేక్షణ లోపం, బిల్డర్లతో కొందరు కుమ్మక్కు కావడం వల్లే అక్రమ లే అవుట్ లు, అనుమతి లేని నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయన్నారు. ఇలాంటి నిర్మాణాలకు అపరాధ రుసుములు విధించడంలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని… సీఎం కేసీఆర్ గారితో చర్చించి దీనిపై తగు నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
పంచాయతీ నిర్వహణపై సంతృప్తి:
గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్క్, స్విమ్మింగ్ పూల్, క్రీడా మైదానాలు, కమ్యూనిటీ హాల్ లను మంత్రి పరిశీలించారు. వీటి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలోని మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి మొక్కలకు వినియోగించుకొనే విధానాన్ని ఆసక్తిగా తిలకించారు. ఇతర గ్రామపంచాయతీలు కూడా ఇలాంటి మురుగునీటి రీసైక్లింగ్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ శివార్లలో గుడిసెలు వేసుకొని ఉంటున్న వలస కూలీలతో మంత్రి మాట్లాడారు. అనంతరం పంచాయతీ ఆదాయ, వ్యయ రికార్డ్ లను పరిశీలించారు. పంచాయతీ పాలక వర్గంతో సమావేశమై గ్రామ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్ధేశం చేశారు.