×

 భారీ పోలింగ్‌ వైయస్సార్‌ కాంగ్రెస్‌ విజయానికి సంకేతం -జగన్ ధీమా

 భారీ పోలింగ్‌ వైయస్సార్‌ కాంగ్రెస్‌ విజయానికి సంకేతం -జగన్ ధీమా

‘అఖండ విజయం సాధిస్తున్నాం. ఇది ప్రజల విజయం. అందుకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఓటమి తప్పదని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబునాయుడు సీఎం స్థాయిని కూడా దిగజార్చారని, ఎన్నికల సంఘాన్ని బెదిరించారని, కుయుక్తులు పన్నారని, అరాచకాలు సృష్టించారని, డ్రామాలూ చేశారని ఆయన ఆక్షేపించారు. ఇంతటి ఆటుపోట్లు తట్టుకుని పార్టీ తరపున నిలబడిన ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని అభినందిస్తున్నానని వెల్లడించారు.
 పోలింగ్‌ ప్రక్రియలో పార్టీకి చెందిన వారు కొందరు గాయపడ్డారని, ఇద్దరి ప్రాణాలు పోయాయని జననేత ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  80 శాతానికి పైగా ప్రజలో ఓటింగ్‌లో పాల్గొన్నారని, వారంతా తమ ఓటు వీవీ ప్యాట్‌ల్లో చూసుకున్నారని, అందరూ తృప్తి చెందారని, అలాంటప్పుడు రీపోలింగ్‌ ఎందుకని ప్రశ్నించారు. కేవలం ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబునాయుడు  ఆ డిమాండ్‌ చేస్తున్నారని ఆక్షేపించారు.
పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత గురువారం రాత్రి హైదరాబాద్‌లో  వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు.
సీఎం స్థాయిని దిగజార్చారు
ఈ ఎన్నికల్లో తన ఓటమి తప్పదని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు సీఎం స్థాయిని కూడా దిగజార్చి ఏకంగా ఎన్నికల కమిషన్‌ను బెదిరించడం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, ఓటింగ్‌ శాతం తగ్గించేందుకు రకరకాల కుయుక్తులు పన్నడం, అరాచకాలు సృష్టించడం, డ్రామాలు చేయడం, అన్నీ కూడా చూశామని వైయస్‌ జగన్‌ అన్నారు. అయినప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని రక్షించే కార్యక్రమం చేసినందుకు అందరికీ ..  ప్రతి అక్కా చెల్లెమ్మకు, ప్రతి అవ్వా తాతకు, ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.
అభినందన–సానుభూతి
ఇంతటి ఆటుపోట్లు తట్టుకుని పార్టీ తరపున నిలబడ్డ ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని అభినందిస్తున్నానన్న జననేత, ఈ పోలింగ్‌ ప్రక్రియలో కొంత మంది గాయపడ్డారని, ఇద్దరి ప్రాణాలు కూడా పోయాయని, పార్టీ సానుభూతిపరులు చనిపోయారని ఆవేదన చెందారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.
ఓడిపోతామని తెలిసి
వ్యవస్థను ఒకసారి చూస్తే.. ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు , తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది అని చూస్తే మాత్రం.. నిజంగా ఒక వ్యక్తి ఓడిపోతాడని తెలిసి, ఆ ఓటమిని ఏ రకంగా తనను తాను రక్షించుకునేందుకు ఏ స్థాయికి మనిషి దిగజారిపోతాడు అని చూస్తే చాలా బాధనిపిస్తోందని  వైయస్‌ జగన్‌ అన్నారు.
పోలింగ్‌ ప్రక్రియలో చోటు చేసుకున్న ఘటనలు, వైయస్సార్‌ కాంగ్రెస్‌ నాయకులపై జరిగిన దాడులను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం
భారీ పోలింగ్‌ ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని  వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. అందుకే చంద్రబాబు ఓటింగ్‌ శాతం తగ్గించడానికి చాలా ప్రయత్నించారని, అందుకు ఎన్నో విధాలుగా ప్రకటనలు చేశారని, కానీ ప్రజలకు అన్నీ తెలుసని, వారే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారని చెప్పారు.  మహిళలు తప్పకుండా తమ వెంటే ఉన్నారని, చంద్రబాబు చేసిన మోసాన్ని వారు ఎప్పుడూ మర్చిపోరని అన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఈ విషయం ప్రస్తావించానంటూ, పసుపు–కుంకుమ పేరుతో చేసిన మోసాన్ని వివరించారు.

చంద్రబాబునాయుడు, కేసీఆర్‌ మధ్య ఉన్న రిటర్న్‌ గిఫ్ట్‌తో తనకేమి సంబంధమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఏదేమైనా రాష్ట్రంలో అఖండ విజయం సాధించబోతున్నామని తేల్చి చెప్పిన  వైయస్‌ జగన్, ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేయబోనని స్పష్టం చేశారు.

print

Post Comment

You May Have Missed