భవిష్యత్తులో కొత్త తరహా ఉద్యోగాలు, కొత్త తరహా కార్యాలయాల రూపకల్పన

ప్రపంచ ఆర్ధిక వేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు
  న్యూయార్క్, సెప్టెంబర్ 26: నాలుగో పారిశ్రామిక విప్లవ పథంతో ఆంధ్రప్రదేశ్ రానున్న కాలంలో వినూత్న ఆవిష్కారాలకు వేదిక కానున్నదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.  ప్రపంచ ఆర్ధిక వేదిక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి ‘శీఘ్ర సుస్థిర ఉత్పాదకత సాధన’  అనే అంశంపై సంయుక్త పత్రాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భారత్ లో ఆంధ్రప్రదేశ్ ముందుందని, సరైన భాగస్వామ్యాలతో విజయాలను అందుకునే సమయంలో తామున్నామని, స్థిర ఉత్పాదకత కోసం టెక్నాలజీల అమలుతో ఈ   భాగస్వామ్య చిరకాలం  కొనసాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
  విశ్వస్థాయి నుంచి స్థానిక స్థాయి వరకు జరిగే వ్యాపారంలో ఇటువంటి భాగస్వామ్యం నాలుగో పారిశ్రామిక విప్లవం మరింతగా విజయవంతం కావడానికి  దోహదపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. 4.0 సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను ఆంధ్రప్రదేశ్ కొనసాగిస్తుందని,  వరల్డ్ ఎకనమిక్ ఫోరం లాంటి వేదికల ద్వారా అంతర్జాతీయ స్థాయి మేలిమి పద్ధతులను  పంచుకుని, అనుసరిస్తామని, అన్వయించుకుంటామని చంద్రబాబు తెలిపారు. భాగస్వామ్యాలు సోపానంగా లబ్దిదారులతో చర్చావేదికల్లో సంభాషిస్తామని రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి ఒక విధాన రూపకల్పనలో ఇటువంటివి ఎంతగానో తోడ్పడతాయని అన్నారు.
డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని చట్టబద్ధంగా బదలాయింపులో, లావాదేవీలలో ముఖ్యపాత్ర వహించే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, మనుషులకు పని ఒత్తిడి తగ్గించి, మరింత, వేగంగా,  సృజనాత్మకతతో పనిచేయడానికి  రోబోల సేవలతో కూడిన  కొబాటిక్స్ టెక్నాలజీతో రానున్న కాలంలో కొత్తతరహా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమమవుతోంది. ఈ నేపథ్యంలో శ్రామిక శక్తి, కార్యాలయాలు, కార్యస్థానాలను రీడిజైన్ చేయడం అనివార్యం.
నాలుగో పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో ఆ  ఫలాలు అందుకుని నవ్య తరహాలో రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి   ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న  దార్శనిక కృషికి ఇటువంటి భాగస్వామ్యాలు, వేదికలు పంచుకోవటం ఎంతో దోహదపడతాయి.
 ఆధునికతకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధి కల్పనలో యువతకు శిక్షణనివ్వడానికి, తగిన పరిజ్ఞానం అందించడానికి  రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యాన్నిస్తోంది. ఈ దిశగా  అంతర్జాతీయ సంస్థలు, వాణిజ్య వర్గాలతో కలసి పనిచేస్తోంది.  భవిష్యత్తు తరాల ఉద్యోగావకాశాల కల్పనలో ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తోంది.
 ఏపీ ఐటీ మంత్రి లోకేశ్‌ కి, వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వాహక బృందానికి మధ్య జరిగిన చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ లోకేశ్ చైనా (Tianjin)  పర్యటన, రాష్ట్రంలో  త్వరలో నెలకొల్పనున్న సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో భాగస్వామ్యం  తదితర అంశాలను ఉదహరించారు.
  కాగా ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సెంటర్  మనదేశపరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తోడ్పడుతుంది. విశ్వవ్యాప్తంగా ఉన్న విఖ్యాత సంస్థలు, కంపెనీలు, ఎకాడమియాను, అంతర్జాతీయ సంస్థలు, ప్రసిద్ధ వ్యక్తులను రాష్ట్రానికి తీసుకురావటంలో ప్రభుత్వానికి అనుసంధానకర్తగా తోడ్పాటునందిస్తుంది.
  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్ర మోహన రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ సాలడుగు వెంకటేశ్వర్ తదితరులున్నారు.
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.