శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈ రోజు క్షేత్రపరిధిలో పలుచోట్ల పర్యటించి భద్రతా చర్యలను పరిశీలించారు.
ఇందులో భాగంగా రథశాల, టోల్ గేట్ కూడలి, సాక్షిగణపతికూడలి, హఠకేశ్వరంకూడలి, ముఖద్వారం, లడ్డు ప్రసాదాల విక్రయకేంద్రాలు, సీసీ కంట్రోల్ రూమ్ మొదలైన వాటిని పరిశీలించారు. ముందుగా రథశాలను పరిశీలించారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ రథశాల పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కవరేజ్ కోణాలలో అవసరమైన మార్పులు చేసి, రథశాల, , పరిసరాలు మరింత ప్రస్ఫుటంగా కనపడేందుకు తగు చర్యలు చేపట్టాలని సంబంధితకులను ఆదేశించారు.అదేవిధంగా రథశాలకు అవసరమైన మరమ్మతులను కూడా వెంటనే చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.ముఖ్యంగా గంగాధరమండపం వద్ద విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది రథశాల భద్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
కార్యనిర్వహణాధికారి టోల్ గేట్ పరిశీలిస్తూ టోల్ గేట్ వద్ద లగేజీ స్కానరును ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించి, వెంటనే తగు చర్యలు చేపట్టాలని కూడా ఇంజనీరింగ్ మరియు భద్రతా విభాగాన్ని ఆదేశించారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ టోల్ గేట్ పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని కూడా ఇంజనీరింగ్, ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. సాక్షిగణపతివద్ద, టోల్ గేట్ వద్ద పకడ్బందీగా తనిఖీలను నిర్వహిస్తుండాలని భద్రతా విభాగాన్ని ఆదేశించారు.ముఖద్వారం, హఠకేశ్వరం, సాక్షిగణపతి, టోల్ గేట్ మొదలైన చోట్ల మరిన్ని మార్గ సూచికలను, సూచనబోర్డులను ఏర్పాటు చేయాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.భద్రతా సిబ్బంది వారికి నిర్దేశించిన ప్రదేశాలలో విధులు నిర్వహిస్తున్నప్పుడు, ఆయాచోట్ల భక్తులు కోరే సమాచారాన్ని కూడా అందించాలన్నారు. ముఖ్యంగా భక్తులతో పూర్తి మర్యాదగా మెలగాలని సూచించారు.ముఖ్యంగా శని,ఆది, సోమవారాలు, ప్రభుత్వపు సెలవు రోజులలో భక్తులరద్దీ ఎక్కువగా ఉంటుందని, సమయానుసందర్భంగా రద్దీ క్రమబద్దీకరణకు ముందస్తు ఏర్పాట్లు చేస్తుండాలని ముఖ్యభద్రతాధికారిని ఆదేశించారు.
ప్రసాదాల విక్రయకేంద్రాల క్యూలైన్లలో భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా త్వరితగతిగా ప్రసాదాలను అందజేస్తుండాలని కార్యనిర్వహణాధికారి సిబ్బందికి సూచించారు.శ్రీశైల క్షేత్రాన్ని ప్రతిరోజు వేలాదిసంఖ్యలో భక్తులు సందర్శిస్తారని , అందుకే క్షేత్రభద్రత అనేది ఎంతో ప్రాముఖ్యం గల అంశమని అన్నారు. భద్రతా సిబ్బంది విధినిర్వహణ సమయములో పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు.
కోవిడ్ నివారణకై ప్రత్యేక శ్రద్ధ
శ్రీశైలాన్ని సందర్శించే భక్తుల సంఖ్య పెరుగుతున్న కారణంగా కోవిడ్ నివారణ చర్యలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని కార్యనిర్వహణాధికారి ఆయా విభాగాలను ఆదేశించారు.భక్తులకు వసతి కల్పించేటప్పుడు, భక్తులు క్యూలైన్లో ప్రవేశించేముందు, దేవస్థానం ఉద్యోగులకు ఎప్పటికప్పుడు తప్పనిసరిగా థర్మల్ గతో శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాలన్నారు. ఎవరికైనా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికంటే అధికంగా ఉన్నట్లయితే విషయాన్ని వెంటనే వైద్యులకు తెలిజేయాలన్నారు.క్యూలైన్లు, ఆలయ ప్రాంగణములోనే కాకుండా శ్రీశైల వీధులో సంచరించేటప్పుడు కూడా భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించేవిధంగా చర్యలు చేపట్టాలని భద్రతా విభాగాన్ని ఆదేశించారు.ఈ విషయమై ఆలయ ప్రసారవ్యవస్థ ద్వారా తరుచుగా సూచనలు చేసేవిధంగా చర్యలు చేపట్టాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.
అదేవిధంగా భక్తులు వసతిని పొందేటప్పుడు, దర్శనం క్యూలైన్లలోనూ, ప్రసాదాల విక్రయకేంద్రం వద్ద, కల్యాణకట్ట వద్ద విధిగా భౌతికదూరం పాటించేవిధంగా వారిలో అవగాహన కల్పించాలన్నారు.ఈ విషయమై ఎప్పటికప్పుడు భద్రతా సిబ్బంది భక్తులలో అవగాహన కల్పించాలన్నారు.అన్ని క్యూలైన్లు, ఆలయప్రాంగణము, ప్రసాదవిక్రయ ప్రాంగణం మొదలైన చోట్ల ప్రతి రెండు గంటలకు ఒకసారి క్రిమి సంహారక ద్రావణాన్ని పిచికారి చేస్తుండాలని ఆలయ విభాగాన్ని ఆదేశించారు.
పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మురళీబాలకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, భద్రతా అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రజాసంబంధాల అధికారి శ్రీనివాసరావు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.