భగీరథ ప్రాజెక్టు పనులు నభూతో అన్నరీతిలో ఉన్నాయి – ఎం.పి. తాగునీటి శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ అశీష్ కుమార్ శ్రీవాత్సవ
హైదరాబాద్ ఆగష్టు 29(ఎక్స్ ప్రెస్ న్యూస్): మిషన్ భగీరథ కాస్ట్లీ ప్రాజెక్టు కాదు, హ్యండ్ సమ్ ప్రాజెక్టు అన్నారు మధ్యప్రదేశ్ తాగునీటి శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ అశీష్ కుమార్ శ్రీవాత్సవ. ప్రజారోగ్యం కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా తక్కువే అన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి మూడు రోజుల పర్యటనకు వచ్చిన మధ్యప్రదేశ్ తాగునీటి అధికారుల బృందం తొలిరోజు ఎర్రమంజిల్ లోని అర్డబ్లుఎస్ కార్యాలయంలో అధికారులును కలిసింది. భగీరథ ప్రాజెక్టు స్వరూపం, లక్ష్యాలను ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వారికి వివరించారు. టెండర్ పద్దతులతో పాటు అంచనాల తయారీలో అనుసరించిన విధానాలను తెలిపారు. ఆ తర్వాత మాట్లాడిన అశీష్ కుమార్ శ్రీవాత్సవ, ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించాలన్న సంకల్పం చాలా గొప్పదన్నారు. అందుకే ఇవాళ దేశం మొత్తం మిషన్ భగీరథ ప్రాజెక్టును ఆసక్తిగా గమనిస్తోందన్నారు. భగీరథ ప్రాజెక్టు పనులు నభూతో అన్నరీతిలో సాగుతున్నాయని, చూసి రావాలని కేంద్రప్రభుత్వమే తమకు సూచించిందన్నారు. రేపు, ఎల్లుండి పనులను స్వయంగా పరిశీలిస్తామన్నారు. త్వరలో తమ రాష్ట్రంలోనూ భగీరథ లాంటి ప్రాజెక్టును ప్రారంభించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని, ఇక్కడి అనుభవాలను అందుకోసం ఉపయోగించుకుంటామన్నారు.
ఆ తర్వాత మాట్లాడిన జనరల్ మేనేజర్ పికే రఘువన్షి, మిషన్ భగీరథ మొత్తం దేశానికే మోడల్ ప్రాజెక్టు అన్నారు. ధృడమైన రాజకీయ సంకల్పంతోనే మిషన్ భగీరథ పనులు ఈ స్థాయిలో జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా ప్రాజెక్టు పురోగతిని పర్యవేక్షించడం అరుదైన విషయమన్నారు. అర్డబ్లుఎస్ ఇంజనీర్లే ప్రాజెక్టు డిజైన్, టెండర్ల విధి విధానాలను ఖరారు చేయడం తమను ఆకర్షించిందన్నారు. చివరగా మాట్లాడి అర్డబ్లుఎస్ న ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి, ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయని, ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి ప్రతీ గ్రామానికి రక్షిత నీటిని అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే అటవీ,రైల్వే, నేషనల్ హైవేస్ అనుమతులు త్వరగా వచ్చాయని, ఫలితంగానే ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. మొన్నటి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సలహాల ప్రకారం పనిచేసి వచ్చే సంవత్సరం జూన్ నాటికి ఇంట్రా పనులు కూడా పూర్తిచేస్తామన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు భగీరథ ప్రాజెక్టుపై ఆసక్తి చూపించడానికి పనుల్లోని పారదర్శకతే కారణమన్నారు. కేసీఆర్ మార్గనిర్దేశనం, అధికారులు, వర్క్ ఏజెన్సీల అంకితభావంతోనే ఇవాళ భగీరథ ప్రాజెక్టు గురించి యావత్ దేశం మాట్లాడుతోందన్నారు. త్వరలోనే హర్యానా నుంచి కూడా ఓ అధికారుల బృందం మిషన్ భగీరథ పనులనుపరిశీలించడానికి వస్తోందన్నారు. రేపు మెదక్- సింగూరు, ఎల్లుండి ఎల్లూరు-మహబూబ్ నగర్ సెగ్మెంట్ లో జరుగుతున్న పనులను మధ్యప్రదేశ్ బృందం చూస్తుందన్నారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్లు విజయపాల్ రెడ్డి, విజయ్ ప్రకాశ్, ఒఎస్ది సత్యపాల్ రెడ్డి, కన్సల్టెంట్లు నర్సింగరావు,బాబూరావు, ఈఈ విజయ్ కుమార్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు