హైదరాబాద్ నెక్లేస్ రోడ్డులోని వండర్ పార్కులో ఈ రోజు బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రి కేటీఆర్ ను ఆశీర్వదించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులందరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ వచ్చినంక బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్ద పీట వేశామని, బ్రాహ్మణుల కోసం 17 పథకాలు ప్లాన్ చేశామని, ప్రస్తుతం 5 పథకాలు మాత్రమే అమలు అవుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఎన్నికల తర్వాత మిగిలిన పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దేశం మొత్తంలో ట్రెజరీ నుంచి పురోహితులకు జీతాలు ఇస్తున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విశ్వకల్యాణం కోసం కేసీఆర్ ఆయుత చండీయాగం చేశారని కేటీఆర్ గుర్తుచేశారు.
బ్రాహ్మణుల స్థితిగతులపై కేసీఆర్ కు మంచి అవగాహన ఉందని, దేవాలయాల అభివృద్ధికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని, యాదాద్రి ని ఎంతో శ్రద్ధతో మహా పుణ్యక్షేత్రంగా తీర్చి దిద్దుతున్నారన్నారు.పేదరికానికి కులంతో సంబంధం లేదని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.ఎన్నికల్లో మీ మద్దతు కోసం వచ్చానని, మీ ఆశీర్వాదం లభించడం ఎంతో సంతోషమని బ్రాహ్మణులను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు.
టీఆర్ఎస్ సీనియర్ నాయకులు , రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వ్రతధర జీయర్ స్వామి వారు కేటీఆర్ ను ఆశీర్వదించారు.