వేద భూమికి, తెలంగాణకు గర్వకారణమైన ప్రముఖ సంస్కృతాంధ్రవిద్వత్కవి,మహామహోపాధ్యాయులు బ్రహ్మశ్రీ దోర్బల విశ్వనాథశర్మ శుక్రవారం రాత్రి 1.30 గంటలకు నిర్యాణం చెందారు. విశ్వనాథశర్మ అనారోగ్యంతో హైదరాబాదులో కన్నుమూశారు.ఆయన వయస్సు 90 సంవత్సరాలు.1931 లో అప్పటి మెదక్ జిల్లా రామాయంపేటలో జన్మించిన శర్మ సంస్కృతాంధ్రభాషలలో అపారపాండిత్యాన్ని సంపాదించి లబ్ధప్రతిష్ఠులయ్యారు.ఆయన రచించిన ‘శ్రీలాలిత్యం’ అశేషపాఠకాభిమానులను అలరించింది.సంస్కృతాంధ్రభాషలలో శతకాలూ,కావ్యాలూ,వ్యాఖ్యానాలూ శతాధికంగా రచించి ఉభయభాషలలోనూ అపారకీర్తిని గడించారు.రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట సేవాపుర స్కారంతో ముఖ్యమంత్రి వీరిని సత్కరించారు. రవీంద్రభారతిలో జరిగిన తెలంగాణ విద్వత్సభ రాష్ట్ర మహాసభల్లో మహోన్నత సేవాసత్కారంతో సమ్మానితులయ్యారు.ఇంకా ఎన్నో జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయి పురస్కారాలను,సత్కారాలను పొందారు.
బాలశేఖర శర్మ దోర్బల నివాళి:
దోర్బల విశ్వనాథ శర్మ మహా పండితుడు, కవి, జ్ఞాని, గొప్ప మానవతావాది. ప్రచార ఆడంబరాలకు అతీతులు. ఆణిముత్యం. వారి ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు అత్యంత ఆప్తులు, ఆత్మీయులు.
దోర్బల వంశానికే మకుటాయమానం. ఇంత నిరాడంబర జీవితాన్ని ప్రేమించిన వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. డా. సినారె సమకాలీనుడు. నేను సినారెని కలిసినప్పడల్లా ‘విశ్వనాథశర్మ గారు ఎలా ఉన్నారు?’ అని వాకబు చేసేవారు. మనిషి భౌతికంగా దూరమైనా తాను చూపిన మార్గం మా అందరికీ ఆదర్శనీయం.
సౌజన్యమూర్తి,పుంభావ సరస్వ తి,శ్రీలలితా చరణ చారణ చక్రవర్తి శ్రీమాన్ బ్రహ్మశ్రీ దోర్బల విశ్వనాథ శర్మ శాశ్వతానందలోకం చేరారని దర్శనం శర్మ పేర్కొన్నారు.
onlinenewsdiary.com tributes:
onlinenewsdiary.com extends tributes to the great scholar Brahmasri Vishwanadha Sharma. He is pride of this great vedic land.