శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థాన వేదపండితులు, అర్చకులు, పరిచారకులకు, సిబ్బందికి సంస్కృత భాష పరిజ్ఞానంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ఈ రోజు ముగిసింది.గతనెల 22వ తేదీన ఈ శిక్షణా తరగతులు ప్రారంభించారు. మొత్తం 12 రోజులు పాటు ఈ శిక్షణా తరగతులు జ రిగాయి.దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణా తరగతులలో సంస్కృత భారతీ, స్వచ్చంద సేవా సంస్థ, హైదరాబాదు శిక్షణ ఇచ్చింది .
ఈనాటి ముగింపు కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి కే ఎస్ .రామ రావు మాట్లాడుతూ సిబ్బంది నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈ శిక్షణను ఏర్పాటు చేశామన్నారు.భవిష్యత్తులో మరికొన్నిసార్లు కూడా ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.సంస్కృతం అంటే ఒకచోట చేర్చబడినది, బాగా సంస్కరించబడినది, ఎలాంటి లోపాలు లేనిది, అనంతంగా విస్తరించబడినది అని అర్ధాలు ఉన్నాయన్నారు. సంస్కృతానికి దేవభాష . అమర భాష అనే పేర్లు కూడా ఉన్నాయన్నారు. ఈ సంస్కృత భాషను విన్నంతనే ఎంతో చక్కని అనుభూతి కలుగుతుందన్నారు.సంస్కృత భాష ద్వారా భారతీయులకే సొంతమనదగిన వేదాలు, వేదాంతాలు, వేదాంగాలు, సూత్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, శాస్త్ర సాంకేతిక విషయాలు, తాత్విక అంశాలు, మత, ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలు, కావ్యనాటకాలు మొదలైన ఎన్నో సమాజానికి అందివచ్చాన్నారు.ధార్మిక సంస్థలైన ఆలయాలలో విధులు నిర్వర్తించే అర్చక, పరిచారకులతో పాటు సిబ్బంది అందరు కూడా సంస్కృతంపై అవగాహన కల్పించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ఉద్దేశంతోనే శిక్షణా తరగతులను నిర్వహించామన్నారు.ముఖ్యంగా పిల్లలకు బాల్యం నుంచే సంస్కృత భాషపై అవగాహన కల్పించడం ఎంతో మంచిదన్నారు. అందరూ సంస్కృత భాషను నేర్చుకునేందుకు వీలుగా సులభమైన ప్రణాళికను సంస్కృతి భారతీ సంస్థ వారు రూపొందించారన్నారు . .
సంస్కృతి భారతీ సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శి సంజీవ్ కుమార్ మాట్లాడతూ దేవస్థాన సిబ్బందికి తమ సంస్థ ద్వారా శిక్షణను ఇవ్వడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామరావు ఆశయానికి అనుగుణంగా శ్రీశైలక్షేత్రాన్ని సంస్కృత క్షేత్రంగా విరాజిల్లింప చేసేందుకు తమ వంతు సహకారాన్ని అందజేస్తామన్నారు.అనంతరం అమ్మవారి ఆలయ అర్చకలు వి.ఫణికుమారశర్మ మాట్లడుతూ శ్రీశైలక్షేత్రములో భక్తులు దర్శించవలసిన ప్రదేశాలను సంస్కృత భాషలో తెలియజెప్పారు.
చివరగా ఈ 12 రోజులపాటు శిక్షణను అందించిన సంస్కృతభారతీ సంస్థ అధ్యాపకులు శ్రీమతి కైప పద్మావతి, కైప
రామేశ్వరరావు దంపతులకు , సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శి సంజీవ్ కుమార్ లకు వేదశీర్వచనముతో శ్రీ స్వామి అమ్మవార్ల ప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి హరిదాసు, పర్యవేక్షకులు శ్రీహరి, ఉమేష్, ఉభయ దేవాలయాల అర్చక స్వాములు, వేదపండితులు , ఆగమ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
*Kumaaraswaamy puuja,Nandheeshwara puuja, Bayalu Veerbhadra swaamy puuja performed in the temple.Archaka swaamulu performed the puuja.