హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి నిర్వహిస్తున్న బస్తీ దవాఖానాను పనితీరును పరిశీలించేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. బేగంపేటలో ఉన్న శ్యామ్ లాల్ బిల్డింగ్ బస్తీ దవాఖానాను మంత్రి శనివారం ఉదయం తనిఖీ చేశారు. ఉన్న వసతులను అక్కడి సిబ్బంది పనితీరును మంత్రి పరిశీలించారు. నగరంలో మొత్తంగా 1,000 దవాఖానాలు ఉండాలన్న లక్ష్యంతో జిహెచ్ఎంసి పనిచేస్తున్నదని, అన్ని బస్తీల్లోనూ దవాఖానాలు ఉండేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. వివిధ రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేసే డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. శాంపిల్స్‌ను తీసుకొని ఆయా డయాగ్నస్టిక్ సెంటర్ లలో పరీక్షించి నేరుగా రోగుల మొబైల్ ఫోన్ లోకి, లేదా ఈ మెయిల్లోకి పంపించే సదుపాయం కూడా ఉంటుందని తెలిపారు. మంత్రి వెంట జియచ్ యంసి అడిషనల్ కమీషనర్ సిక్తా పట్నాయక్ ఉన్నారు.