– అన్ని రకాల వెన్నెముక ఆపరేషన్లు
– త్రీ డి ప్రింటింగ్ టెక్నాలజీతో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం ఆధునీకరణ
– ఆధునిక వైద్య మెళకువలు, శిక్షణ కోసం ఎయిమ్స్ తో అవగాహన
– బర్ద్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి
తిరుపతి, 2021 ఫిబ్రవరి 12: శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతో పేదల సేవలో తరిస్తున్న బర్డ్ ఆసుపత్రిలో గత ఏడాది కాలంగా ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని బర్ద్ ఆసుపత్రి గౌరవ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి చెప్పారు. శుక్రవారం బర్ద్ సమావేశమందిరం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ – 19 కారణంగా కొన్ని అభివృద్ధి పనులు ఆగిపోయాయన్నారు. దేశ వ్యాప్తంగా కోవిడ్ – 19 గణనీయంగా తగ్గు ముఖం పట్టడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతోందనీ, ఈ నేపథ్యంలో బర్డ్‌లో రోగుల వైద్య సేవలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని ఆయన తెలిపారు. అగిన అభివృద్ధి పనులు మళ్ళీ ప్రారంభంకానున్నాయని చెప్పారు. డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి వెల్లడించిన వివరాలు ఇవీ..
బర్డ్‌లో అన్ని రకాల వెన్నెముక్క ఆపరేషన్లకు శ్రీకారం
బర్ద్ లో గతంలో చాలా అరుదుగా వెన్నెముక ఆపరేషన్లు చేసేవారు. రోగులకు మెరుగైన వైవ్య సేవలు అందించే పరంపరలో భాగంగా బర్డ్‌లో ఇప్పుడు పార్శ్వ గూని సహా అన్ని రకాల వెన్నెముక ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాము. బర్డ్ చరిత్రలో ఇదోక నూతన ఆధ్యాయం. చెన్నైకి చెందిన ప్రముఖ వెన్నెముక సర్జన్లు డా.బాలమురగన్, డా.రాకేష్ బెంగుళూరుకు చెందిన ఆర్థోస్కోపీ స్పెషలిస్ట్ డాక్టర్ హేమంత్ కుమార్, ఉడిపి కి చెందిన హ్యాండ్ మైక్రో వాస్కులర్ స్పెషలిస్ట్ డాక్టర్ భాస్కర్ ఆనంద్ కుమార్ నెలకు రెండు సార్లు ఈ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
బోన్ బ్యాంక్ ఏర్పాటు
బోన్ క్యాన్సర్ పేషంట్లకు మరింత ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తేవడానికి బర్డ్‌లో బోన్ బ్యాంక్ ఏర్పాటు చేయబోతున్నాం.
48 గంటల్లోనే అపరేషన్లు
బర్డ్‌లో మోకీలు మార్పిడి అపరేషన్ కోసం రోగులు ఆర్నెల్ల నుంచి ఏడాది వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ నిరీక్షణ కాలాన్ని 48 గంటలకే కుదించాం. అర్హులైన వారికి అన్ని పరీక్షలతో సహా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్ 48 గంటల్లో పూర్తి చేస్తున్నాం. కోవిడ్ – 19 కారణంగా కొన్ని నెలల పాటు సర్జరీల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం పరిస్థితులు మొరుగు పడుతుండటంతో రోజుకు 20 నుంచి 25 సర్జరీలు చేస్తున్నాం. క్రమంగా ఈ సంఖ్యను పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాము.
బర్డ్‌లోనే ఆనస్తీషియా పరీక్షలు
బర్డ్ ఆసుపత్రిలో ఆపరేషన్లు చేసే రోగులను గతంలో ప్రీ ఆనస్తీషియా పరీక్షల ( రక్త, గుండె పరీక్షలు) కోసం సమీపంలోని ఇతర ఆసుపత్రులకు పంపే పరిస్థితి ఉండేది. దీనివల్ల రోగులు, వారి సహాయకులు ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం బర్డ్ ఆసుపత్రిలోని లేబొరేటరీని ఆధునీకరించి ఫిజిషియన్, కార్డియాలజిస్ట్‌లను నియమించాము. ఆనస్తీషియా విభాగాన్ని మరింత పటిష్ట పరచడం కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్ ర్యాంకు కలిగిన ముగ్గురు డాక్టర్లను నియమించుకున్నాము.
రోజు 500 దాకా ఓపిలు
కోవిడ్ – 19 భయం, ప్రయాణాపై ఆంక్షల కారణంగా కొన్ని నెలల పాటు ఓపిల సంఖ్య బాగా తగ్గింది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడం వల్ల రోజుకు 450 నుండి 500 మంది రోగులు ఓపి సేవలు పొందుతున్నారు.
పేదలకు ఉచిత అపరేషన్లు
దారిద్య్రరేఖకు దిగువన ఉన్నపేదలకు ఉచితంగా మోకీలు, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయడానికి టిటిడి పాలక మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి అంగీకరించారు. పోలియో, పక్షవాతం, దివ్యా0గులకు సంబంధించిన అన్ని శస్త్ర చికిత్సలు ఉచితంగానే నిర్వహిస్తున్నాం. అన్ని రకాల ఫ్యాక్చర్ ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ , ఈహెచ్ఎస్ కింద ఉచితంగా నిర్వహిస్తున్నాం. మోకీలు మార్పిడి పరీక్షలకు కేవలం ఇంప్లాట్స్ ఖర్చులు మాత్రమే రోగి భరించాల్సి ఉంటుంది.
మరో మూడు ఆపరేషన్ థియేటర్లు
ఆపరేషన్ల వెయిటింగ్ లిస్ట్‌ను మరింతగా తగ్గించడానికి సకల సదుపాయాలతో కూడిన మరో మూడు ఆపరేషన్ థియేటర్లు త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నాం.
ఇంప్లాట్స్ కోనుగోలు విధానానికి సంబంధించి పటిష్టమైన సాఫ్ట్‌వేర్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. ఈప్రయత్నం తుది దశలో ఉంది. బర్డ్ ఆసుపత్రిని మరింతగా అభివృద్ధి చేయడానికి ఈవోగారు ఎంతో చొరవ చూపుతున్నారు.
సిటి స్కాన్, ఎమ్ ఆర్ ఐ సేవలు త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. 3డి ప్రింటింగ్ టెక్నాలజితో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయనున్నాం.
మరింత చవకగా రోగులకు మందులు
బర్డ్‌లో రోగులకు మరింత చవకగా మందులు అందుబాటులోకి తేవడానికి జనరిక్ మందుల షాపు ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. రోగుల సౌకర్యం కోసం అన్ని సదుపాయాలతో క్యాంటీన్ అందుబాటులోకి తేబోతున్నాం.
ఎయిమ్స్ సహకారంతో పిజిలకు శిక్షణ
రోగులకు మంచి సేవలు అందించడానికి ఆపరేషన్ల నిరీక్షణ కాలం తగ్గించడానికి అదనంగా వైద్య సిబ్బందిని నియమిస్తున్నాము. ఎయిమ్స్ సహకారంతో పిజిలకు శిక్షణ, ఆధునిక వైద్య చికిత్సల పరిజ్ఞానంపై అవగాహన కల్పించడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ఎయిమ్స్ అధికారులు, వైద్యులతో రెండు విడతల చర్చలు జరిగాయి.
టీటీడీ ఉద్యోగులకు నగదురహిత సేవలు:
టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత పద్ధతిలో ఆపరేషన్లు నిర్వహిస్తున్నాము.
రోగుల కోసం త్వరలో 50 ప్రత్యేక గదులు అందుబాటులోకి తెస్తున్నాము.
నూతన శస్త్ర చికిత్సల నిర్వహణలో వైద్యులకు నైపుణ్యం పెంపొందించడానికి కడావర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాము.
ప్రమాదంలో చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ చేతులు ( కల్ ఆర్మ్)ను డిసెంబరు 3 న ప్రారంభించాము. వీటి కోసం ఇప్పటి వరకు 25 మంది పేర్లు నమోదు చేసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా బర్డ్ మెడికల్ క్యాంప్‌లు నిర్వహించాలని నిర్ణయించాము. ఇందులో భాగంగా మార్చి 20వ తేదీ ఒంగోలులో మొదటి క్యాంప్ నిర్వహించనున్నాం.
ఆర్ఎమ్ ఓ కిషోర్, డాక్టర్ చైతన్య మీడియా సమావేశంలో పాల్గొన్నారు.