ఫెడరల్‌ ఫ్రంట్‌ వేదిక ముందడుగు -జగన్‌తో చర్చలు

హైదరాబాద్‌: తెలంగాణ  రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపాదించిన ఫెడరల్‌ ఫ్రంట్‌ వేదిక హర్షించదగిన విషయమని వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ జగన్‌తో కేటీఆర్‌ బృందం  ఫ్రంట్‌పై చర్చించారు. అనంతరం వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు.  కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడిన పిమ్మట ఆయన కుమారుడు కేటీఆర్‌ వచ్చి చర్చించారు రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించాం. ప్రత్యేక హోదాను పార్లమెంట్‌ను సాక్షిగా చేస్తూ ఇచ్చిన హామీకి దిక్కు లేదు.

రాష్ట్రానికి అన్యాయం జరిగింది. దీన్ని అధిగమించాలంటే రాష్ట్రం పరిధిలోని ఎంపీల సంఖ్య పరంగా సాధ్యం కాదు కాబట్టి..25 మంది ఎంపీలకు తోడు పక్కనే ఉన్న 17 మంది ఎంపీలు కలిసి మొత్తం 42 మంది ఎంపీలు కలిసి వచ్చి పోరాటం చేస్తే కేంద్రం స్పందిస్తుంది. అప్పుడు రాష్ట్రానికి మేలు జరిగే పరిస్థితి ఉంటుంది.

ఇది స్వాగతించాల్సిన అంశం. రాష్ట్రాల హక్కులు కాపాడాలంటే సంఖ్య పరంగా పెరగాలి. అప్పుడే కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసే విషయంలో వెనుకడుగు వేస్తుంది. కేసీఆర్‌ వేసిన  అడుగులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయం. కే టీఆర్‌ కూడా అదే విషయాలు చెప్పారు. మళ్లీ చర్చలకు కేసీఆర్‌ వస్తారని కేటీఆర్‌ చెప్పారు. కేటీఆర్‌ చెప్పిన అంశాలపై మేం పార్టీలో సుదీర్ఘంగా చర్చిస్తాం. ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకుంటాం.రాష్ట్రానికి మేలు జరిగేలా ముందుకు వెళ్తాం.

కేటీఆర్‌తో పాటు ఎంపీ వినోద్‌ కుమార్‌, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్‌ రెడ్డిలు వైయ‌స్ జ‌గ‌న్ స్వ‌గృహానికి చేరుకున్నారు. కేటీఆర్‌ బృందానికి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు సాద‌ర స్వాగ‌తం ప‌లికి చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించారు.

వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి,టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లు ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చలు జరిపారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌ లోని వైయస్‌ జగన్‌ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చర్చల ప్రక్రియకు ఇది ప్రారంభం మాత్రమే అని అన్నారు.

మరో దఫా చర్చలు జరుగుతాయని, తెలంగాణ సీఎం  కేసీఆర్‌ కూడా చర్చల్లో పాల్గొంటారన్నారు.ఫెడరల్‌ ఫ్రంట్‌ యూపీఏ,ఎన్డీయేలకు భిన్నంగా ఉంటుందన్నారు.రాష్ట్ర హక్కుల పరిరక్షణకే ఈ కూటమి అని స్పష్టం చేశారు.ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేవారికే  వైయస్‌ఆర్‌సీపీ మద్దతు అని పునరుద్ఘాటించారు.

print

Post Comment

You May Have Missed