తిరుమల, 2021 ఫిబ్రవరి 21: భీష్మ ఏకాదశి సందర్భంగా ఫిబ్రవరి 23న ఉదయం ఏడు గంటలకు తిరుమల నాదనీరాజనం వేదికపై విష్ణు సహస్రనామ పారాయణం జరగనుంది. దాదాపు మూడు గంటల పాటు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇందుకోసం ఆదివారం నాదనీరాజనం వేదికపై వేదపండితులతో విష్ణు సహస్రనామ పారాయణం ట్రయల్ రన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా లక్ష్మీ అష్టోత్తరం 30 శ్లోకాలు, పూర్వపీఠిక 29 శ్లోకాలు, విష్ణు సహస్రనామం 108 శ్లోకాలు, ఉత్తరపీఠిక 34 శ్లోకాలు పారాయణం చేయాలని నిర్ణయించారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు, టిటిడి వేదపారాయణదారులు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ స్కీమ్ వేదపారాయణదారులు ఈ పారాయణంలో పాల్గొంటారు.