ప్రజల ఆవేదనకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకే వికేంద్రీకరణ చట్టం-ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం: పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. వికేంద్రీకరణ బిల్లును సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూపొందించడం, దానికి గవర్నర్ ఆమోదముద్ర వేడయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యమని, ఈ చట్టాన్ని అందరూ స్వాగతించాలన్నారు. శనివారం శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు..
ప్రజల ఆవేదనకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకే వికేంద్రీకరణ చట్టం..
అభివృద్ధి ఫలాలు అందరికి అందడం లేదన్న ఆవేదన దేశమంతా ఉంది. ఇలాంటి ఆవేదనకు ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాఫ్ పడాలి. అలాంటి వాటికి పరిష్కారం చూపేందుకే వికేంద్రీకరణ చట్టం ఏర్పాటైంది. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే ఈ చట్టాన్ని సీఎం వైయస్ జగన్ చేశారు. 12 సెక్షన్లు, నాలుగు ప్రాంతాల గురించి ఈ చట్టంలో అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడాం. దీన్ని చట్టం రూపంలోకి తీసుకువచ్చేందుకు సంప్రదింపులు పూర్తి చేసి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇది చారిత్రాత్మకమైన బిల్లు, ఏపీ ప్రభుత్వం వైయస్ జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురావడం సంతోషకరం. దీన్నిఎవరైనా స్వాగతించాల్సిందే. సభలు ఎక్కడ పెడతారన్నది రెండో అంశం. వికేంద్రీకరణ అన్నది ముఖ్యమైన పాలసీ. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయం. మన రాజ్యాంగం అదే చెబుతుంది. ఆర్టికల్ 38, 39 కూడా ఆనాడే చెప్పాయి. దానికి విరుద్ధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోకూడదని ఆ రోజు నేను అసెంబ్లీలో చెప్పాను. సీఎం వైయస్ జగన్ నిర్ణయం ఆర్టికల్ 38, 39కు లోబడే ఉంది.
ప్రజల ఆకాంక్షల మేరకే..
ఈ చట్టం ప్రకారం కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంకు వస్తుంది. న్యాయ రాజధాని కర్నూలు ఉంటుంది. శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి విశాఖ కంటే గొప్ప నగరం ఎక్కడుంది. విశాఖనే పూర్తిగా అభివృద్ధి చేస్తామంటే ఈ చట్టం అనుమతించదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ఈ చట్టంలో పెట్టాం. ఇందులో ఎవరికి అనుమానాలకు కూడా అవకాశం లేదు. గతంలో తెలంగాణలో వచ్చిన ఉద్యమాలు కూడా రావు. అలాంటి భరోసాను ఈ చట్టం ఇస్తుంది.
పరిపాలన వికేంద్రీకరణకు అడుగులు..
పరిపాలన ఎంత డిసెంట్రలైజ్ అయ్యిందో ప్రజలకు అర్థమవుతుంది. ప్రతిపక్షాలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయి. పరిపాలన కింది స్థాయికి తీసుకెళ్లాలి. అందుకే వికేంద్రీకరణ జరగాలి. అనేక దేశాల్లో ఈ పని జరగలేదు. వనరులు లేని దేశాల్లో ఈ కార్యక్రమాలు ముందుకు సాగలేదు. ఒక వాలంటీర్ ద్వారా నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు ఇంటికే తీసుకెళ్లి ఇవ్వడం గొప్ప విషయం. ఇలాంటి చట్టాలు తీసుకురాలేకపోయింటే అభివృద్ధి కష్టమయ్యేది. ఇదే కదా రాష్ట్ర విభజనకు దారి తీసింది. మరోసారి పొరపాటు జరగకూడదని సీఎం వైయస్ జగన్ ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేంది..
ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత వాసుల కోరిక ఇప్పుడు నెరవేరింది. ఈ ప్రాంతం అభివృద్ధికి పునాది పడింది. ఈ ఆలోచన చేసిన ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పూర్తిగా స్వాగతిస్తున్నాను. అందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉందని మనవి చేయుచున్నాను. ఇందుకు నాయకుడైన వైయస్ జగన్‌ను కూడా అందరూ అభినందించాల్సిన అవసరం ఉందని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.
Post Comment