శ్రీశైల దేవస్థానం:భారత ప్రభుత్వ ‘ప్రసాద్’ (PRASAD – Pilgrimage Rejuvenation And Spiritual Augmentation Drive) పథకంలో భాగంగా శ్రీశైల దేవస్థానం లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వశాఖ డైరెక్టర్ జనరల్ శ్రీమతి మీనాక్షిశర్మ ఈ రోజు 20 న పరిశీలించారు.
దేవస్థాన అతిథిగృహమైన భ్రమరాంబాసదన్ సమావేశ మందిరంలో ముందుగా పనుల ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామరావు మాట్లాడుతూ ముందుగా శ్రీశైలక్షేత్ర స్థలపురాణం, చారిత్రక అంశాలు, ప్రాచీన సాహిత్యములో శ్రీశైలక్షేత్ర ప్రస్తావన, క్షేత్రంలో నిర్వహించే వార్షిక మహోత్సవాలు, ట్రంలో భక్తులరద్ది, దేవస్థానం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు మొదలైన అంశాలను గురించి క్లుప్తంగా వివరించారు.
తరువాత పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రసాద్ పథకం లో పనుల గురించి కార్యనిర్వహణాధికారి తెలిపారు.
ఈ ప్రసాద్ పథకం క్రింద సౌండ్ అండ్ లైట్ షో, గోశాల సమీపం లో యాంఫీ థియేటర్ ( ఆరుబయలు ప్రదర్శనశాల) నిర్మాణం, నందిసర్కిల్ వద్ద యాత్రికుల సౌకర్యకేంద్ర నిర్మాణం ( సమీకృత సమాచార కేంద్ర నిర్మాణం), ఆలయ ప్రాంగణములో ఆకర్షణీయమైన విద్యుద్దీకరణ, ఇత్తడి క్యూలైన్లు, ఆర్.టి.సి బస్టాండ్ వద్ద వాహనాల పార్కింగ్ ఏర్పాటు, బాహ్యవలయదారివద్ద విశాలమైన పార్కింగ్ ప్రదేశపు అభివృద్ధి పనులు, వలయ రహదారి నుంచి దర్శన క్యూకాంప్లెక్స్ వైపు రోడ్డు నిర్మాణం, ఆర్.టి.సి. బస్టాండ్ నుండి పాతాళగంగ పాతమెట్ల వరకు రోడ్డు నిర్మాణం, శిఖరేశ్వర ఆలయం వద్ద పుష్కరిణి పునరుద్ధరణ, యాత్రికుల సౌకర్యకేంద్ర నిర్మాణం, క్యూలైన్ల ఏర్పాటు, వాటవర్ నిర్మాణం, పార్కింగ్ ఏర్పాటు, శిఖరేశ్వర ఆలయం వద్ద పార్కింగ్ ప్రదేశం నుండి) ర్యాంప్ నిర్మాణం, హఠకేశ్వరాలయం వద్ద యాత్రికుల సౌకర్యకేంద్ర నిర్మాణం, పునర్నిర్మాణం చేయబడుతున్న పంచమఠాలలో ఆకర్షణీయమైన లైటింగ్ ఏర్పాట్లు, త్రపరిధిలో పలుచోట్ల శౌచాలయాలు మొదలైన పనులు చేపట్టారు.
తరువాత డైరెక్టర్ జనరల్ క్షేత్రపర్యటన చేసి పై పనులన్నింటిని పరిశీలించారు. పనుల ప్రగతి పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
తరువాత డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ నందిసర్కిల్ వద్ద నిర్మించిన యాత్రికసౌకర్యకేంద్రములో భక్తులకు అవసరమైన క్షేత్ర సమాచారం, వసతి సదుపాయ ఏర్పాట్లు, ఆర్జిత సేవల వివరాలు, స్థానిక దర్శనీయ స్థలాల వివరాలు మొదలైన వాటి పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి కూడా భక్తులు శ్రీశైలక్షేత్రాన్ని దర్శిస్తున్న కారణంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాల్సిన అవసరముందన్నారు.
యాంపిథియేటర్ నిర్మాణం పూర్తి అయిన వెంటనే ప్రతివారంలో కూడా నిర్దేశించిన రోజులలో ముఖ్యంగా భక్తులరద్ది అధికంగా ఉండే ఆది,సోమవారాలలో భక్తి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
శిఖరేశ్వరం వద్ద గల పుష్కరిణి వద్ద అవసరమైన మేరకు ఆకర్షణీయమైన లైటింగ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.
సమీక్షా సమావేశములోను, క్షేత్రపర్యటనలోనూ ఏపి టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, చీఫ్ ఇంజనీర్ సి.ఎస్.ఎన్. మూర్తి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్ రెడ్డి, కర్నూలు డి.వి.ఎం. ఈశ్వరయ్య, తెలంగాణా టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ బి. మనోహర్, తెలంగాణా టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.వి.శంకర్ రెడ్డి పాల్గొన్నారు.
దేవస్థానం ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు పి. మురళీ బాలకృష్ణ, డి.వి. భాస్కర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఐసి) శ్రీనివాసరెడ్డి, సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.
శాస్ట్రోక్తంగా సుబ్రహ్మణ్యషష్ఠి:
మార్గశిర శుద్ధ షష్ఠిని పురస్కరించుకుని ఈ రోజు సుబ్రహ్మణ్యషష్ఠి మహోత్సవం నిర్వహించారు.
ఈ ఉత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి (కుమారస్వామి) ప్రత్యేక అభిషేకం, పూజాదికాలు, సుబ్రహ్మణ్యహోమం, విశేషంగా శ్రీవల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం తదితర కార్యక్రమాలు జరిపారు.
లోకకల్యాణం కోసం ప్రతి మంగళవారం, షష్ఠి, కృత్తికా నక్షత్రం రోజులలో సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం నిర్వహిస్తున్నారు .
ప్రతిరోజు కూడా ఆర్జితసేవగా వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరకల్యాణం ఉంటుంది.
సుబ్రహ్మణ్యషష్ఠిని పురస్కరించుకుని ఈ పూజాదికాలతో పాటు హోమం కూడా నిర్వహించారు.
విశేష అభిషేకం స్వామివారి అభిషేకానికి ముందు కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగాలని ముందుగా మహాగణపతి పూజ జరిపారు.
పంచామృతాలతోను గంధోదకం, భస్మోదకం, బిల్వోదకం, పుష్పోదకం, మల్లికా గుండంలోని పుణ్యజలంతో సుబ్రహ్మణ్యస్వామివారికి అభిషేకం జరిపారు.
అనంతరం స్వామివారికి పూజాదికాలు జరిగాయి.
సుబ్రహ్మణ్యహోమం:
| ఈ పూజాదికాల తరువాత లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సుబ్రహ్మణ్యహోమం జరిపారు. ఈ హోమానికై సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి ఎదురుగా ప్రత్యేకంగా హోమగుండాన్ని ఏర్పాటు చేసారు.
వైభవంగా కల్యాణోత్సవం:
తరువాత నిత్యకల్యాణ మండపంలో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి వైభవంగా కల్యాణోత్సవం జరిపారు.
కళ్యాణోత్సవానికి ముందుగా అర్చకస్వాములు కల్యాణోత్సవ సంకల్పాన్ని పఠించారు. తరువాత కల్యాణోత్సవం నిర్విఘ్నంగా జరుగాలని గణపతిపూజ జరిపారు. పుణ్యాహవచనం కంకణపూజను చేసి స్వామివారికి కంకణధారణ చేసారు. తరువాత స్వామివారికి యజ్ఞోపవీతధారణ చేసారు.
కన్యావరణ మంత్రాలు పఠించారు. ఆ తరువాత స్వామివారికి వరపూజను జరిపారు. వరపూజ అనంతరం స్వామిఅమ్మవార్ల ప్రవరల పఠనాన్ని జరిపారు.
తరువాత సుబ్రహ్మణ్యస్వామివారికి మధువర్కం సమర్పించారు. పెరుగు, నెయ్యి, తేనె కలిపిన మధురపదార్థానికే మధుపర్కం అని పేరు.
అనంతరం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించారు . తరువాత భాషికధారణ చేయబడింది. ఆ తరువాత గౌరీ పూజ జరిపారు.
గౌరీపూజ తరువాత శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివార్లకు తెరసెల్లను ఏర్పరచి మహాసంకల్ప పఠనం చేసారు.
సుముహూర్తసమయంలో జీలకర్ర, బెల్లం సమర్పించారు. ఆ తరువాత మాంగల్యపూజను జరిపించి శ్రీవల్లీ దేవసేన అమ్మవార్లకు మాంగల్యధారణ నిర్వహించారు. తరువాత తలంబ్రాలు, బ్రహ్మముడి కార్యక్రమాలను జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు, కల్యాణ అక్షతలను అందించారు.
శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారి కల్యాణోత్సవాన్ని దర్శించడం వలన సంతానం లేనివారికి సత్సంతానం కలుగుతుంది. వివాహం కానివారికి వివాహయోగం సిద్ధిస్తుంది. గ్రహదోషాలు ముఖ్యంగా రాహు, కేతు, కుజదోషాలు, సర్పదోషాలు నివారించబడుతాయని నమ్మకం . ఋణబాధలు తీరి, శత్రుబాధలు తొలగిపోతాయని, న్యాయవివాదాలలో విజయం లభిస్తుంది. అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరి కోరికలు నెరవేరుతాయని నమ్మకం.