రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు, ఆశయాలకు అనుగుణంగా ఒక టీం వర్క్ లాగా పని చేసి ప్రభుత్వ లక్ష్య సాధనకు కృషి చేస్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
సోమేశ్ కుమార్ మంగళవారం నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డా.ఎస్.కె.జోషి నుండి పదవీ బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను నిర్ధిష్ట కాలవ్యవధిలో పూర్తి చేసేలా కృషిచేస్తానన్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయంతో పనిచేస్తానని అన్నారు. విధి నిర్వహణలో వినూత్న పద్దతులను అవలంబిస్తూ, రాష్ట్ర అభివృద్దికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక వివిధ రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించిందని అన్నారు. ప్రభుత్వ లక్ష్య సాధనకు మీ అందరి సహకారం అందించాలని కోరారు. పేద ప్రజలకు, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ఉద్యోగులు పని చేయాలన్నారు. పదవీ విరమణ పొందిన డా.ఎస్.కె.జోషి తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. వారు పాటించిన పద్దతులను అనుసరిస్తామని అన్నారు. జి.హెచ్.యం.సి కమి షనర్ గా , రెవెన్యూ ముఖ్య కార్యదర్శి గా పని చేసిన సమయంలో జోషి ఎంతో సహకారమందించారన్నారు. వారి సేవలను గుర్తించి ప్రభుత్వం నీటిపారుదల శాఖ సలహాదారులుగా నియమించిందని, వారి సలహాలు ఎల్లప్పుడు అందించాలని కోరారు.
ఈ రోజు పదవీ విరమణ పొందుతున్నసి.యస్ డా.ఎస్.కె.జోషి మాట్లాడుతూ, అధికారిక విధుల నిర్వహణలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అధికారులందరు ఎంతో ఉత్సాహంతో పనిచేశారని అదే ఉత్సాహంతో పనిచేయాలన్నారు.
జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా సమావేశానికి వచ్చిన అధికారులకు స్వాగతం పలికారు, అనంతరం జోషి అందించిన సేవలను కొనియాడారు. సి.యస్ గా బాధ్యతలు స్వీకరించిన సోమేశ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.
డి.జి.పి. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, డా.ఎస్.కె.జోషి పోలీసు శాఖకు అందించిన సహకారం, మార్గ దర్శకత్వం మరువ లేనిదని కొనియాడారు. క్లిష్ఠ సమయాలలోను తగు సలహాలు, సూచనలు అందించారన్నారు. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సోమేశ్ కుమార్ జి.హెచ్.యం.సి కమిషనర్ గా , రెవెన్యూ ముఖ్య కార్యదర్శి గా పనిచేసిన సమయంలో నగర పోలీస్ కమీషనర్ గా పని చేశానని , ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలలో పూర్తి సహకారం అందించారన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్ తివారి, చిత్రారామ చంద్రన్ , ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, జయేష్ రంజన్, అర్వింద్ కుమార్, సునీల్ శర్మ, రాజీవ్ త్రివేది, వికాస్ రాజ్, హర్ ప్రీత్ సింగ్ , సి.ఇ.ఓ.రజత్ కుమార్, పార్ధసారథి, సబ్యసాచి ఘోష్, కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, నవీన్ మిట్టల్ , కమీషనర్ వ్యవసాయ శాఖ రాహుల్ బొజ్జా, సిడియంఎ డైరెక్టర్ టి.కె.శ్రీదేవి , పి.సి.సిఎఫ్ శోభ, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, వివిధ విభాగ అధిపతులు, అధికారులు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యం.నరేందర్ రావు, పద్మాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు డా.ఎస్.కె.జోషి తో అనుభవాలను గుర్తు చేసుకున్నారు. నూతన సి.ఎస్ కు అభినందనలు తెలుపుతూ పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.