కర్నూలు నగరంలోని సంతోష్ నగర్ ఈద్గా వద్ద జాతీయ రహదారిని కాంగ్రెస్
దిగ్బంధించాయి . ఏపీకి ప్రత్యేక హోదా.. మా హక్కు.. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్-బెంగళూరు మధ్య వెళ్తున్న బస్సులు.. ప్రైవేటు వాహనాలు హైవే పై ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
భారీ సంఖ్యలో ఉన్న కార్యకర్తలను కంట్రోల్ చేయడం కోసం పోలీసులు ఏపీఎస్పీ నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు. ఓ వైపు ఎండ కాక పుట్టిస్తుండడంతో.. గంటకు పైగా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే క్లియర్ చేయాలంటూ లీసులను వేడుకోవడంతో.. పోలీసులు ఆందోళన నిర్వహిస్తున్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, డీసీసీ అధ్యక్షులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, మైనారిటీ నాయకులు జనాబ్ అహ్మద్ అలిఖాన్, దళిత నాయకులు అశోకరత్నం, బుచ్చిబాబు తదితరులను బలవంతంగా పోలీసు వ్యాన్ ఎక్కించారు. కేంద్ర మాజీ మంత్రి కోట్లను పోలీసులు అరెస్టు చేయకుండా కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు వారిని బలవంతంగా తోసేశారు. దీంతో కార్యకర్తలు-పోలీసుల మధ్య కొద్దిసేపు తోపులాటలు జరిగాయి.