అమరావతి, జూన్ 14 : ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, ఎక్కడా సమస్య తలెత్తకుండా చేసి ప్రజలలో సంతృప్తి స్థాయిని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయం ఆర్టీజీ వ్యూహ మందిరంలో గురువారం సాయంత్రం ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో పౌర సరఫరాల మంత్రి పత్తిపాటి పుల్లారావుతో కలిసి ముఖ్యమంత్రి ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరును సమీక్షించారు. రాష్ట్రంలో సుమారు 5 వేల చౌక ధరల దుకాణాలలో కొద్దిరోజులుగా తాను స్వయంగా జరిపిన సర్వేలో కొన్ని లోపాలను గుర్తించానని మంత్రి ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. నిత్యావసర వస్తువుల పంపిణీలో ప్రజల సంతృప్తి స్థాయి 60 శాతానికి మాత్రమే పరిమితం కావడానికి ముఖ్యంగా ఐదు సమస్యలను కనుగొన్నామని చెప్పారు. చాలా దుకాణాలలో రేషన్ డీలర్లు రశీదులు ఇవ్వడం లేదని, తూకం కొలతలు కూడా సక్రమంగా ఉండటం లేదని తెలిపారు. కొన్ని ప్రాంతాలలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ సక్రమంగా ఉండకపోవడం మరో ప్రధాన సమస్యగా మారిందని చెప్పారు.
కొంతమంది డీలర్లు సరుకులు తీసుకోవడానికి వచ్చే ప్రజలతో వ్యవహరించే తీరు సక్రమంగా వుండటం లేదని, ప్రజలలో అసంతృప్తికి ఇదొక ముఖ్యమైన కారణమని మంత్రి వివరించారు. మరికొన్నిచోట్ల చౌక ధరల దుకాణాలను బినామీలు నడుపుతున్నారని, దీనివల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. సోమవారం రాష్ట్రంలోని చౌక ధరల దుకాణదారులతో వీడియో కాన్ఫరెన్సు పెట్టి ఈ సమస్యలన్నీ వివరించి ఈ పరిస్థితిని మార్చకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వుంటుందని స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రిని ఆదేశించారు. కొన్నిరోజులు చూశాక అప్పటికీ మార్పు కనిపించకపోతే అప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.