ప్రజలకు పరిశుభ్రమైన మంచినీరు ప్రతీనిత్యం అందించే లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం అనుకున్న ప్రకారం నడుస్తుండడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అధికారులు రేయింబవళ్లు కష్టపడి పనిచేసి తెలంగాణ రాష్ట్ర గౌరవం పెంచుతున్నారని సిఎం కితాబునిచ్చారు. అతి తక్కువ సమయంలో అనేక అవాంతరాలు అధిగమించి ముందుకుసాగుతున్న పథకం 2017 డిసెంబర్ నాటికి పూర్తి కావడమే లక్ష్యంగా పనిచేయాలని సిఎం పిలుపునిచ్చారు. గ్రామాల్లో పైపులైన్ల నిర్మాణం, ఇంట్లో నల్లాలు బిగించే పనులు అతి ముఖ్యమైన పనులుగా భావించాలని సిఎం చెప్పారు. పథకం ప్రారంభంలో ఎదురయ్యే బాలరిష్టాలను అధిగమించాలని, ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు తప్పక తలెత్తుతాయనే విషయం అందరి దృష్టిలో ఉండాలని సిఎం అన్నారు.
మిషన్ భగీరథపై ఎంసిఆర్ హెచ్ఆర్డిలో సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత రెడ్డి, మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్, ఆర్.డబ్ల్యు.ఎస్. ఇఎన్సి సురేందర్ రెడ్డి, సిఇలు, ఎస్ఇలు, ఇఇలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇన్ టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, పైపులైన్ల నిర్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం, జిఎల్బిఆర్ ల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నదని, కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలని ఆలోచిస్తున్నదని, ఆరు రాష్ట్రాలు ఇప్పటికే మిషన్ భగీరథను అధ్యయనం చేశాయని సిఎం చెప్పారు. ఈ పథకం కోసం వివిధ ఆర్థిక సంస్థలు ఇప్పటికే రూ.22వేల కోట్లు అప్పుగా ఇవ్వడానికి అంగీకరించాయని, మరో ఏడెనిమిది వేల కోట్ల రుణం కూడా వస్తున్నదన్నారు. ఇంకా అవసరమైతే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామన్నారు. నిధుల కొరత లేదు కాబట్టి, బిల్లులు కూడా వెంటనే చెల్లిస్తున్నామని, కాబట్టి పనులు కూడా అనుకున్నదాని ప్రకారం వేగంగా జరిగే విధంగా వర్క్ ఏజన్సీలతో మాట్లాడాలని చెప్పారు. గ్రామాల్లో అంతర్గత పనులు చేసే కాంట్రాక్టర్లు సకాలంలో పనులు పూర్తి చేస్తే 1.5శాతం ఇన్సెంటివ్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. పైపులైన్లు వేసే సందర్భంలోనే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కూడా అందులోనే వేయాలని, దీనికోసం ఐ.టి.శాఖ నుంచి సాంకేతిక అంశాలపై సలహా తీసుకోవాలని సూచించారు. తక్కువ జనాభా కలిగిన ఆవాస ప్రాంతాల్లో హెచ్.డి.పి.ఇ పైపులు వేయాలా? పివిసి పైపులు వేయాలా? అనే అంశంపై స్థానిక భౌగోళిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఇఇలకు అప్పగిస్తున్నట్లు సిఎం ప్రకటించారు. భవిష్యత్తులో మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు 365 రోజుల పాటు 24 గంటలూ అందేవిధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు.
మిషన్ భగీరథ పథకం పూర్తి చేయడంతో పాటు భవిష్యత్తులో ఈ పథకం నిర్వహణ బాధ్యత కూడా ఆర్.డబ్ల్యు.ఎస్. శాఖకే ఉంటుందని చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మురికి కాల్వల నిర్మాణం తదితర పనులు కూడా చేయాల్సి ఉన్నందున ఈ శాఖకు పనిభారం ఎక్కువవుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్.డబ్ల్యు.ఎస్. శాఖను పునర్వ్యవస్థీకరించుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ, ఆర్.డబ్ల్యు.ఎస్. లను కలిపేయాలని, అవసరాన్ని బట్టి పదోన్నతులు కల్పించాలని చెప్పారు. పని విభజన కూడా పకడ్బందీగా జరగాలని చెప్పారు.
‘‘మిషన్ భగీరథకు ప్రత్యేకంగా మంత్రి లేరు. ఆ శాఖ నా వద్దే ఉంది. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా నియమితులైన వేముల ప్రశాంత రెడ్డికి కేబినెట్ హోదా కల్పించినం. ఆయనే మంత్రితో సమానం. అధికారులతో సమీక్షలు నిర్వహించే అధికారం ఉంది. స్వయంగా ఇంజనీర్ కూడా అయిన ప్రశాంత్ రెడ్డి మీ శాఖ ద్వారా జరిగే పనులు పర్యవేక్షిస్తారు. ఇతర శాఖల మంత్రులు, అధికారులతో కూడా సమన్వయం కుదురుస్తారు’’ అని సిఎం చెప్పారు.