ప్రగతి పథకాల అమలుతీరు ప్రజలకు చేరాలి
కనీసం మూడు పాజిటివ్ కథనాలను పంపించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రముఖుల పర్యటనలు, ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాల ఫోటోలు, వీడియోలు, వివరాలను పంపాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఎంతో అభివృద్ధి కనిపిస్తోందని , ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల ప్రచారంలో సమాచార పౌరసంబంధాల శాఖాధికారులు ముఖ్యభూమిక పోషించాలని అన్నారు . శుక్రవారం డా. ఎం.సి.ఆర్ .హెచ్ .ఆర్.డి. ఇన్ స్టిట్యూట్ లో సమాచార పౌర సంబంధాల శాఖలో వివిధ స్ధాయిలో పనిచేస్తున్న అధికారులకు, ప్రభుత్వ పథకాల ప్రచారంలో సోషల్ మీడియా వినియోగం పై ,ఐటి శాఖ డిజిటల్ మీడియా సహకారంతో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రతిష్టాత్మక కార్యక్రమాల ద్వారా ప్రజలలో వచ్చిన సానుకూల మార్పులు, అభివృద్ధికి సంబంధించి తగిన వార్తలు వచ్చేలా ప్రత్యేకంగా కథనాలను మీడియాకు అందించేలా పనిచేయాలని అర్వింద్ కుమార్ ఆదేశించారు.సంక్షేమ కార్యక్రమాల ప్రచారంలో సోషల్ మీడియాను (ఫేస్ బుక్, ట్విట్టర్) విస్తృతంగా వాడాలని ఆదేశించారు. అధికారులు టీం వర్కులా పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ,ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, కెసిఆర్ కిట్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, విద్య, వైద్యం, మహిళా శిశుసంక్షేమం, మున్సిపాలిటీలలో అమలవుతున్న అర్బన్ స్కీమ్స్ వంటి కార్యక్రమాల ద్వారా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం పై ప్రత్యేక వార్తా కథనాలు మీడియాకు అందించాలన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారులు కలెక్టర్ కు నిత్యం అందుబాటులో ఉండి జిల్లా అధికారులతో ఆయాశాఖల అభివృద్ధి కార్యక్రమాలపై సమాచారం సేకరించి ప్రజలలోకి చేరేలా చూడాలనిఅర్వింద్ కుమార్ కోరారు. జిల్లాలో ప్రత్యేకంగా అభివృద్ధిపై రాష్ట్ర స్ధాయిలో ప్రచారం వచ్చేలా కమీషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా సెల్ కు ఎప్పటికప్పుడు పంపించాలన్నారు. విజయగాధలను ప్రజలకు చేరవేయాలన్నారు. అన్ని శాఖలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను ప్రజల్లోకి చేరేలా చూడాలన్నారు.
ఐటి శాఖ డైరెక్టర్ కొనతం దిలీప్ మాట్లాడుతూ సోషల్ మీడియా విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని, సమాచార శాఖ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ మాద్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలన్నారు. ఖచ్ఛితమైన సమాచారాన్ని మాత్రమే పోస్ట్ చేయాలన్నారు. సోషల్ మీడియా ప్రయోజనాలు, పేజీల నిర్వహణ ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. జిహెచ్ ఎంసి పరిధిలో ఇప్పటికే 60 లక్షల మంది ఫేస్ బుక్ యూజర్స్ ఉన్నారని, పోలీసు, ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు వినియోగిస్తున్నారని అన్నారు. ట్విట్టర్ కు సంబంధించి ట్వీట్స్, రీట్వీట్స్, హష్ ట్యాగ్స్, ఫోటోస్, వార్తల అప్ లోడ్ విధానంపై అవగాహన కల్పించారు. సమాచార శాఖకు సంబంధించి ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్స్ ను పాపులరైజ్ చేయాలని సూచించారు. రియల్ టైం సమాచారాన్ని తక్కువ సమయంలో ఎక్కువ మందికి రీచ్ అయ్యే సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించాలన్నారు.
సమాచార అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లే మాట్లాడుతూ, కమీషనర్ ఆదేశం మేరకు సమాచార శాఖ సిబ్భంది సమిష్టిగా పనిచేసి ప్రభుత్వ పథకాలకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా సోషల్ మీడియాపై అవగాహన కలిగిందన్నారు. సమాచార శాఖ ఛీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ కిషోర్ బాబు, పబ్లిసిటిసెల్ డిప్యూటి డైరెక్టర్ మధుసూదన్, సోషల్ మీడియా ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ జెడి.శ్రీమతి సుజాత, డిప్యూటీ డైరెక్టర్లు, ఆర్ ఐలు, క్షేత్రస్ధాయి పౌర సంబంధాల అధికారులు కమీషనర్ కార్యాలయపు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post Comment