అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సోమవారం పోలీస్ అధికారులతో తన కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్ర డిజిపి ఎం. మహేందర్ రెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్త , అడిషనల్ డిజిపి (శాంతి భద్రతలు) జితేందర్ ,పోలీస్ కమిషనర్ లు అంజనీ కుమార్ (హైదరాబాద్) మహేష్ భగవత్ (రాచకొండ కమిషనరేట్ ),వి.సి.సజ్జనార్ (సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్), అనిల్ కుమార్ ,హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్, సంజయ్ కుమార్ జైన్ (డి.జి., ఫైర్ సర్వీసెస్ ) తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చర్చించ వలసిన విషయాలను పోలీసు అధికారులతో హోంమంత్రి సమీక్షించారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసు అధికారులు , సిబ్బంది చేసిన కృషిని, చేపట్టిన వినూత్న పథకాలను ఈ సందర్భంగా పోలీసు అధికారులు వివరించారు. హైదరాబాద్ నగరం సురక్షిత పట్టణంగా గుర్తింపు పొందడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలను సమర్థంగా కాపాడటం,హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్, కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి పోలీస్ స్టేషన్లు ఉత్తమ పోలీసు స్టేషన్లు గా పేరు తెచ్చుకోవడం, ఎన్ సీ ఆర్ బీ డేటా ప్రకారం దాదాపు 65 శాతం పైగా కేసులు సి సి టీవీ ల సహకారంతో చేదించడం, షీ టీమ్ లో ఏర్పాటు,మహిళా భద్రతా విభాగం ఏర్పాటు చేయడం, ఎన్నో సంచలనాత్మక కేసులోను చేదించి నిందితులను పట్టుకోవడం వంటి ఎన్నో విషయాల ద్వారా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే పేరు తెచ్చుకుందని అధికారులు హోం మంత్రికి వివరించారు.