కేంద్రం, రాష్ట్రాల పన్నులను ఐదు శ్లాబులుగా విభజించారని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. 4, 6, 12, 18, 26 శాతాలుగా పన్ను విధానం రానుందన్నారు. ఢిల్లీలో మూడు రోజులపాటు జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తొలి రోజు పాల్గొన్న ఆయన వివరాలను వెల్లడించారు. 26 శాతం పన్ను దాటిన వస్తువులపై పన్నును సెస్ రూపంలో తీసుకురానుందని ఈటల తెలిపారు. ప్రతి ఏటా జీఎస్టీ ఆదాయంపై 14 శాతం గ్రోత్ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని చెప్పారు. రాష్ట్ర ఆదాయం కన్నా తక్కువ పన్ను వస్తే ఆ నష్టాన్ని కేంద్రం భరిస్తుందన్నారు.
పేదలను దృష్టిలో పెట్టుకొని ఏ వస్తువుకు ఎంత శాతం పన్ను ఉండాలి అనే అంశంపై చర్చ జరిగిందని మంత్రి ఈటల చెప్పారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. సామాన్య ప్రజలపై భారం పడకుండా జీఎస్టీ విధానం ఉండాలని గత కౌన్సిల్ సమావేశంలో వివరించామని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రాల హక్కులను, అధికారాలను కాలరాసే విధానానికి వ్యతిరేకం అని స్పష్టం చేశామన్నారు. కేంద్రం చేతుల్లో ఆదాయం పెట్టి, రాష్ట్రాలు కేంద్రం చుట్టూ తెరిగే పరిస్థితి ఉండొద్దు అని గతంలోనే తెలిపామని వివరించారు.
తెలంగాణలో వెనకబడిన జిల్లాలకు రూ. 450 కోట్లు విడుదల చెయ్యాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరామని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. రూ. 450 కోట్లు విడుదల చేస్తామని జైట్లీ చెప్పారని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన సీఎస్టీ బకాయిలు త్వరగా చెల్లించాలని కోరామని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని తీసుకురావాలని యూపీఏ ప్రభుత్వం 2007లో ఆలోచన చేసిందని మంత్రి రాజేందర్ చెప్పారు. 2017 ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ విధానం అమలులోకి రానుందన్నారు.