*టీయుడబ్ల్యుజె-ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ ప్రకటన*
పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ఈ ఎన్నికలు మంచి అవకాశంగా భావించి, చిన్న, పెద్ద, అధికార, ప్రతిపక్ష తేడా లేకుండా గత నెల రోజుల నుండి అన్నీ రాజకీయ పార్టీల చీఫ్ లను కలిసి వినతి పత్రాలను సమర్పించడమే కాకుండా, వారితో ప్రత్యేకంగా సమావేశమై సమస్యలను వారి దృష్టికి తెస్తున్న విషయాన్ని మీరు గమనిస్తున్నారు. ఇప్పటివరకు
9 రాజకీయ పార్టీల ప్రధాన బాధ్యులతో, రెండు జాతీయ పార్టీల అగ్ర నాయకులతో మేము సమావేశమై క్రింద పేర్కొన్న అంశాలపై వారితో చర్చించాము. ఈ సమస్యల పరిష్కారానికి వారి వారి మేనిఫెస్టోల ద్వారా స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరాము .
* రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పనిచేస్తున్న దాదాపు 3,500 మంది అర్హులైన జర్నలిస్టులకు, డెస్క్ జర్నలిస్టులకు, వీడియో, ఫోటో జర్నలిస్టులకు, న్యూస్ ప్రెజెంటర్లకు ఇంటి స్థలాలు, ఇండ్లు అందించాలి.
* జిల్లాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు వారి వారి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, ఇండ్లు అందించాలి.
* జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు అపరిమితంగా, అన్ని ఆసుపత్రుల్లో ఇన్ పేషంట్, ఔట్ పేషంట్ వైద్య సేవలు అందించాలి.
* జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేటు విద్యా సంస్థల్లో కేజీ టు పిజి ఉచిత విద్యను అందించే విధానాన్ని అమలు పర్చాలి
* నాలుగేళ్ల వ్యవధిలో మృతి చెందిన ప్రతి జర్నలిస్టు కుటుంబానికి
రూ.5 లక్షల ఆర్థిక సహకారం అందించాలి. మృతుల భార్యలకు జీవితాంతం ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున పెన్షన్ అందించాలి.
* కనీసం 20 ఏళ్ళు జర్నలిస్టుగా సేవలందించి, 60 ఏండ్ల వయస్సు పూర్తయిన విశ్రాంత జర్నలిస్టులకు
రూ.10వేల పెన్షన్ అందించాలి.
* అక్రెడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు ఆర్టీసీ మాదిరిగా మెట్రో రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి.
* జర్నలిస్టులకు ప్రోత్సాహంగా గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఏటా ఉత్తమ జర్నలిస్టు అవార్డుల అనవాయితిని కొనసాగించాలి.
* ఎబిసిడి వర్గీకరణతో చిన్న,మధ్య తరగతి పత్రికల యాజమాన్యాలకు, అందులో పనిచేస్తున్న జర్నలిస్టులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చుతున్న జి.ఓ.239 ను తొలగించాలి.
* శ్రమ దోపిడీకి గురవుతున్న జర్నలిస్టులకు కనీస వేతనాల చట్టం అమలు చేయించాలి.