తెలంగాణ రాష్ట్రంలో 23శాతం ఉన్న పచ్చదానాన్ని (గ్రీనరీ) ని రికార్డు స్థాయిలో పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగురామన్న తెలిపారు.పర్యావరణ దినోత్సవం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణపై దేశరాజధాని ఢిల్లీలో 5 రోజుల సదస్సు ఏర్పాటు చేసింది. ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్రం తరపున మంత్రి జోగురామన్న హాజరయ్యారు. అనంతరం మంత్రి జోగు రామన్న మీడియాతో మాట్లాడుతూ, రోజు రోజుకు పెరుగుతున్న పర్యావరణ మార్పును గమనించే ముఖ్యమంత్రి కే సీ ఆర్ పర్యావరణ పరిరక్షణకు తొలి ప్రాధాన్యత ఇచ్చారని జోగురామన్న కితాబు ఇచ్చారు. మరోవైపు 2022 నాటికి ప్లాస్టిక్ రహిత తెలంగాణ ను ఏర్పాటు చేసేందుకు ఐటీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారని స్పష్టం చేశారు.
ఒక రాష్ట్రం, ఒక సిఎం పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారిస్తే సరిపోదని అన్ని రాష్ట్రాలు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని జోగు రామన్న ఈ సందర్భంగా విజ్నప్తిచేశారు. పర్యావరణ రూపంలో పొంచి ఉన్న ముప్పు ను గుర్తించకపోతే భావి తరాల మనుగడ కష్టం అని జోగురామన్న తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అన్ని విధాలుగా కృషి చేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్న ఫ్యాక్టరీలను ఇప్పటికే తమ తెలంగాణ ప్రభుత్వం మూసి వేసిందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చర్యలను చేపడితే తప్ప, ఆ కంపెనీలను పునః ప్రారంభించలేమని కంపెనీ యాజమాన్యాలకు తేల్చి చెప్పామని చెప్పారు. ఒక్క ప్రభుత్వాలే కాకుండా, ప్రజలు సైతం పర్యావరణ పరిరక్షణ కై నడుం బిగించినప్పుడే 100% మార్పును సాధించగలమని జోగురామన్న స్పష్టం చేశారు.
పర్యావరణ దినోత్సవ లో భాగంగా రాజ్ పథ్ లో ఏర్పాటు చేసిన సింగరేణి స్టాల్ ను మంత్రి జోగు రామన్న, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా లు సందర్శించారు. స్టాల్ లో ఏర్పాటు చేసిన మ్యాన్ రైడింగ్ సిస్టమ్ మోడల్, ఓబి టూ సాండ్ ప్రొసెసింగ్ మోడల్, అడ్రియాల లాంగ్ వాల్ మోడల్, బాటమ్ ఆశ్ స్టోగింగ్ మోడల్ ను మంత్రి పరిశీలించారు.
ప్రధానంగా పర్యావరణ పరిరక్షణలో సింగరేణి చేప్పట్టిన ఈ యంత్రాల పనితీరును అడిగి తెలుసుకున్న మంత్రి వారిని అభినందించారు.