నగరవాసులకు ఎనీ టైం వాటర్
హైదరాబాద్ ఆగష్టు 26(ఎక్స్ ప్రెస్ న్యూస్): నగరవాసులకు అతితక్కువ ధరకే నాణ్యమైన మంచినీటిని అందించడానికి జీహెచ్ఎంసీ మరో పథకాన్ని ప్రారంభించింది. కేవలం రెండు రూపాయిలకే లీటరు, 20 రూపాయలకు 20లీటర్ల మంచినీరును అందించే ఎనిటైమ్ వాటర్ మిషన్లను నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటుచేసే కార్యక్రమాన్ని నేడు నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డిలు ప్రారంభించారు. నక్లెస్‌రోడ్ ఎన్టీఆర్గార్డెన్ ఎదురుగా ఏర్పాటుచేసిన ఈ ఏటీఎం వాటర్ కియోస్కి ప్రారంభించిన సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఈ సంవత్సరాంతానికి నగరంలో 200లకుపైగా ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. నీటిలో ఉన్న సహజసిద్దమైన మినరల్స్‌ను తొలగించకుండా స్వచ్ఛమైన నీటిని ఈ కియోస్కిల ద్వారా అందించనున్నట్టు తెలిపారు. స్వీడన్‌కు చెందిన సుప్రసిద్ద జోసబ్ ఇంటర్నేషనల్ సంస్థ అందించే సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఏటీఎం మిషన్లను ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదుర్చుకున్నట్టు తెలియజేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, రెడ్‌క్రాస్, రెడ్ క్రీసెంట్ తదితర సంస్థలు నిర్థారించిన నాణ్యతప్రమాణాలకు అనుగునంగా ఈ నీటిని అందించనున్నామని తెలిపారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ కియోస్కిల ద్వారా అందించే జలాలలో ఏవిధమైన రసాయనాలు ఉపయోగించకుండా నీటిలో ఉండే సహజసిద్దమైన లవణాలు కోల్పోకుండా అందించనున్నామని తెలిపారు. ఈ ఏటీఎం కేంద్రాలకు నీటిని అందించడానికి జలమండలి అంగీకరించిందని తెలిపారు.