తెలంగాణ శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు ఎన్నికలలో పోటీచేయడానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా నిర్ణీత పద్ధతిలో డిక్లరేషన్ ప్రచురించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రజత్ కుమార్ స్పష్టం చేసారు. నామినేషన్ల ఉపసంహరణ తేదీ తరువాత రోజునుండి పోలింగ్ ముగియడానికి రెండురోజుల ముందువరకు, ఈ డిక్లరేషన్ తాలూకు సమాచారాన్ని విస్తృత ప్రజాదరణ పొందిన వార్తా పత్రికలలో, ఎలక్ర్టానిక్ మీడియాలో బోల్డ్ (Bold) అక్షరాలలో కనీసం మూడు సార్లు అలా ప్రకటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ మేరకు ఆదేశాలు జారీచేసినట్లు ఆయన వివరించారు.
పోటీలో ఉన్న అభ్యర్థులు వారిపై ఉన్న క్రిమినల్ కేసుల సమాచారాన్ని తెలుపుతూ ఫార్మాట్-సి-1లో డిక్లరేషన్‌ను, .అటువంటి అభ్యర్థులను పోటీకి నిలిపే రాజకీయ ఫార్మాట్-సి-2లో ఇస్తూ డిక్లరేషన్ ప్రచురించాల్సి ఉంటుందని ఆయన గురువారం హైదరాబాద్‌లో విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలియచేసారు. ఫార్మాట్-సి-2లోని ఆ డిక్లరేషన్‌ను సదరు రాజకీయ పార్టీలు వాటి వెబ్‌సైట్‌లో కూడా ప్రదర్శించడం తప్పనిసరని ఆయన స్పష్టం చేసారు.
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు వారి నేర చరిత్రకు సంబంధించిన డిక్లరేషన్‌ల ప్రచురణ విషయంలో పాటించాల్సిన విధివిధానాలపై కేంద్ర ఎన్నికల సంఘం మరింత స్పష్టతనిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్న 5 రాష్ట్రాలకు లేఖలుపంపినట్లు శ్రీ రజత్ కుమార్ వెల్లడించారు.
దాని ప్రకారం-రాష్ట్రంలో, సంబంధిత నియోజకవర్గంలో విస్తృత ప్రజాదరణపొందిన వార్తాపత్రికలు, టీవీ ఛానళ్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు సూచన ప్రాయంగా రూపొందించి అభ్యర్థులకు, పార్టీలకు అందుబాటులో ఉంచుతారు. ఒక అభ్యర్థికి తెలియకుండా పత్రికలలో, టివీల్లో అతని పేరిట మరొకరు తప్పుడు ప్రకటనలు ప్రచురిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(4), భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 171 కింద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
నేర చరిత్ర లేని అభ్యర్థులు ఎటువంటి డిక్లరేషన్‌లు ప్రచురించాల్సిన అవసరం లేదు. క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నా, గతంలో శిక్ష పడి ఉన్నా అటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా డిక్లరేషన్ ప్రచురించాలి. దీనికయ్యే ఖర్చంతా అభ్యర్థి లేదా పార్టీకి సంబంధించిన ఎన్నికల ఖర్చుకిందే పరిగణించడం జరుగుతుంది. డిక్లరేషన్లు ప్రచురితమయిన తరువాత దానితాలూకు సమాచారాన్ని అభ్యర్థులయితే ఫార్మాట్ సి-4లో, పార్టీలయితే ఫార్మాట్ సి-5లో జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలి.