అమరావతి, జూన్ 15 : గృహనిర్మాణ పథకానికి లబ్ధిదారుల ఎంపికలో కఠినంగా వున్న నిబంధనలను సడలించి అర్హులైన అందరికీ ఇళ్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోడానికి కొన్ని నిబంధనలు అడ్డుగా వున్నాయని, వీటిని నిశితంగా పరిశీలించి అవసరమైతే మార్చి అర్హులైన వారందరికీ ఇళ్లను కేటాయించాలని చెప్పారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో పురపాలక మంత్రి పి.నారాయణతో కలిసి ముఖ్యమంత్రి పట్టణ గృహనిర్మాణం పురోగతిని సమీక్షించారు. రూ.3 లక్షలలోపు ఆదాయం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను కూడా గృహ నిర్మాణ పథకంలో చేర్చాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈనెలాఖరులోగా లబ్దిదారుల ఎంపిక పూర్తయిపోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గతంలో రూ.75 వేలలోపు గృహ నిర్మాణ రుణం తీసుకున్న వారి విషయంలో ఉదారంగా వ్యవహరించాలని చెప్పారు. ఇలా రుణం తీసుకున్న వారి ఇళ్లు నివాసయోగ్యంగా లేనట్టయితే వారికి కూడా ఇళ్లను మంజూరు చేయాలని సూచించారు.
లబ్దిదారుల ఫోటోలతో సహా ఎప్పటికప్పుడు వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అధికారులకు సూచించారు. వారం వారం గృహ నిర్మాణ పురోగతిని సమీక్షిస్తానని చెప్పారు.
కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ గృహనిర్మాణ పథకం కోసం ప్రస్తుతం రాష్ట్రంలోని పట్టణ, నగర ప్రాంతాలలో 25,75,339 మంది అర్హులు ఉన్నారని, దానికి తగినట్టుగా కేంద్రం నుంచి మరిన్ని ఇళ్లు మంజూరయ్యేలా చూడాల్సివుందని అన్నారు. అందుకు తగిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 6,81,733 ఇళ్లు మంజూరు చేయగా, 2,81,436 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని అధికారులు చెప్పారు. లక్షా 71 వేల ఇళ్లలో 50 వేల ఇళ్లకు ఇప్పటికే స్థలాలు సమకూర్చగా, మిగిలిన లక్షా 20 వేల ఇళ్లకు అవసరమైన 1058 ఎకరాల భూమిని తక్షణం గుర్తించి గృహనిర్మాణ శాఖకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అఫర్టబుల్ హౌసింగ్ ప్రాజెక్టు కింద చేపట్టిన ‘ఎన్టీఆర్ నగర్’ గృహనిర్మాణ పథకంలో ఇప్పటివరకు 4,81,753 ఇళ్లను మంజూరుచేయగా, అందులో 4,52,657 ఇళ్లు టెండర్ల దశను దాటాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇందులో 2,81,436 ఇళ్లకు సంబంధించి ఇప్పటికే పనులు జరుగుతున్నాయన్నారు. 1,80,512 ఇళ్లకు ఎర్త్ వర్కు పూర్తికాగా, 47,576 ఇళ్లకు స్లాబులు పూర్తయ్యాయని తెలిపారు. లబ్దిదారులే సొంతంగా నిర్మించుకునేందుకు వీలుగా ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద 1,99,980 ఇళ్లు మంజూరు చేయగా, అందులో 1,35,206 ఇళ్లకు పాలనాపరమైన అనుమతులు వచ్చాయని, అందులో 80,718 ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, 28,743 ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. గృహ నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యత గల అంశంగా గుర్తించామని, శరవేగంగా ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్దిదారులకు అందించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర, గృహనిర్మాణశాఖ, మెప్మా అధికారులు పాల్గొన్నారు.