శ్రీశైల దేవస్థానం:నాగులచవితిని కొన్ని ప్రాంతాలలో శ్రావణమాసంలో ఆచరిస్తుండగా, మరికొన్ని చోట్ల కార్తీకమాసంలో ఆచరిస్తున్నారు.ఈ కారణంగా కార్తికశుద్ధ చవితి అయిన ఈ రోజు 18న పలువురు భక్తులు ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద నాగదేవతలను పూజించారు. ఈ రోజు వేకువజాము నుండి భక్తులు నాగులకట్ట వద్దకు చేరుకొని పత్తితో చేసిన వస్త్రం, యజ్ఞోపవీతం, పలురకాల పుష్పాలు మొదలైన వాటితో నాగమూర్తులను అలంకరించి పాలతో అభిషేకించారు. తరువాత నువ్వులపిండి, చలిమిడి, వడపప్పులను నివేదించారు మన సంస్కృతిలో నాగ సంప్రదాయానికి ఎంతో ప్రాముఖ్యం వుంది. శ్రీశైలంలో కూడా పలుచోట్ల నాగవిగ్రహాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆలయ ప్రాకారకుడ్యంపై పలుచోట్ల నాగశిల్పాలను దర్శించవచ్చు. ఈ నాగశిల్పాలలో తూర్పు ప్రాకారంపై గల ఆదిశేషుడు, దక్షిణవైపున గల నాగబంధ శిల్పం ముఖ్యమైనవి.