వారణాసి నగరంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిన ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చేపడుతున్న ప్రాజెక్టుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని జిహెచ్ఎంసి కమిషనర్ , ఇతర ఇంజనీరింగ్ సిబ్బందిని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఆదేశించారు. నగరంలో పెద్ద ఎత్తున చేపడుతున్న ఎస్సార్ డిపి, ప్రాజెక్టు పనుల్లో భాగంగా అనేక చోట్ల ఫ్లైఓవర్లు , ఇతర నిర్మాణాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇతర భారీ సివిల్ వర్స్క్ చేపడుతున్న నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఉదయం మంత్రి జిహెచ్ఎంసి అధికారులకు తెలిపారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్న ప్రాంతాల్లో ఉన్న రక్షణ ఏర్పాట్ల( సేప్టీ మేజర్ మెంట్స్) పైనా పూర్తి స్థాయి సమీక్ష జరపాలని జిహెచ్ఎంసి కమీషనర్ ను మంత్రి కోరారు. దీంతోపాటు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో అవసరమైతే మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నిర్మాణ ప్రాంతాల్లో కార్మికుల రక్షణ చర్యలతోపాటు ఆయా ప్రాంతాల నుంచి మీదుగా ప్రయాణించే నగర పౌరులకు అవసరమైన బారికేడ్లు, మార్గ సూచికలను ఏర్పాటుచేసి అప్రమత్తంగా ఉంచాలని మంత్రి అధికారులను కోరారు. గతంలో మంత్రి ఇచ్చిన మార్గదర్శకాల మేరకు అనేక రక్షణ చర్యలు చేపడుతున్నామని, ఇప్పటి వరకు ప్రమాదం లేకుండా విజయవంతంగా నిర్మాణాలను ముందుకు తీసుకుపోతున్నామని జిహెచ్ఎంసి కమీషనర్ తెలిపారు. మరోసారి నిర్మాణ ప్రాంతాల్లో రక్షణ చర్యలపైన CE (ప్రాజెక్ట్స్). ఇతర ప్రాజెక్టుల ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి త్వరలోనే సమీక్ష నిర్వహిస్తామని అయన తెలిపారు.
- file photo used*