దేశంలో సాగునీటి సమస్యను ఎదుర్కొనే దిశగా కేంద్రం ముందడుగు వేసింది. ఈ రంగంలో ప్రాజెక్టులకు నిధుల కొరతను తీర్చేందుకు ముందుకు కదిలింది. దేశవ్యాప్తంగా 99 సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు కేంద్ర జలవనరుల శాఖ, నాబార్డ్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దీంతో ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులకు రూ.77 వేల కోట్ల నిధుల్ని వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకు (నాబార్డ్) సమకూర్చనుంది. ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన(పీఎంకేవైఎస్) కింద వచ్చే నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తారు. ఈ మేరకు రూ.20 వేల కోట్లతో దీర్ఘకాలిక సాగునీటి నిధి (ఎల్టీఐఎఫ్) ఏర్పాటు చేస్తారు. రాష్ట్రాలు సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి తమ వాటా నిధుల్ని సేకరించడంలో విఫలమైతే మిగతా రూ.57 వేల కోట్లను నాబార్డు ద్వారా సమకూర్చనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 99 ప్రాజెక్టులో తెలంగాణ నుంచి దేవాదుల, కొమురంభీమ్, గొల్లవాగు, రాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, రాజీవ్బీమా, పాలెంవాగు, ఎస్సారెస్పీ-2, ఇందిరమ్మ వరద కాలువలున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 సాగునీటి ప్రాజెక్టులు గుర్తించి నాబార్డు నిధుల ద్వారా మూడు విడతలగా 2019-20లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి దశ 2016-17లో 23, రెండోదశ 2017-18లో 31, మూడో దశ 2019 డిసెంబరులోపు 45 ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ప్రణాళిక రూపొందించారు.
ఈ సందర్భంగా కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి మాట్లాడుతూ.. ప్రస్తుత ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా 70 లక్షలకుపైగా హెక్టార్ల భూమికి సాగునీరు అందేలా రంగం సిద్ధం చేయడం చరిత్రాత్మక ఘట్టమన్నారు. ఈ ప్రాజెక్టులు కరవు పీడిత ప్రాంతాల సమస్యల్ని పరిష్కరించడంలో తోడ్పడతాయన్నారు. సంబంధిత రాష్ట్రాలూ సహకరిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కావల్సిన నిధులు కేటాయించకపోవడం వల్లే దేశవ్యాప్తంగా చాలా ప్రాజెక్టులు అపరిష్కృతంగా మిగిలిపోయాయనీ, దీంతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రాధాన్య ప్రాజెక్టులు ఎంపిక చేసి సకాలంలో పూర్తిచేయడం లక్ష్యంగా ఒప్పందం జరిగిందన్నారు. నిధుల కేటాయింపు, నిర్దేశిత లక్ష్యంలోగా ప్రాజెక్టులు పూర్తి చేసే విషయాన్ని పర్యవేక్షిస్తామని తెలిపారు.