హైదరాబాద్ జూన్ 4 : తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో త్వరలోనే ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. టీటీడీ తరహాలో నూతన సాంకేతికతో భక్తులకు ఆన్లైన్ సేవలు అందించేందుకు దేవాదాయ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. తెలంగాణా రాష్ట్రంలోనే ప్రపథమంగా సికింద్రాబాద్ నగరంలోని గణేష్ దేవాలయంలో ఆన్ లైన్ సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. గణేష్ ఆలయంలో నూతనంగా ప్రవేశ పెట్టిన (www.ganeshtemplesec.telangana.gov.in) ఆన్లైన్ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇకనుంచి రోజువారీ పూజలు, ప్రత్యేక సేవలు, ప్రసాదం, గణపతి హోమం వంటి సేవలు ఆన్ లైన్ లో బుక్ చేసుకోచ్చని తెలిపారు. ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల భక్తులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు ఆలయాల్లో పారదర్శకత పెరిగి ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. భక్తుల విలువైన సమయం వృధా కాదన్నారు. ఆన్ లైన్లోనే హుండీ చెల్లింపులు, విరాళాలు,కానుకలు చెల్లించవచ్చన్నారు. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ భక్తులు కూడా ఆన్ లైన్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆలయాల అభివృద్దికి విశేష కృషి చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రసిధ్ద దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరిగిందన్నారు. ఆలయాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎన్నో కార్య క్రమాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వసతులు కల్పనతో పాటు క్యూలైన్ల క్రమ బద్దీకరణ, సేవాటికెట్లు, వసతి గృహాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
రెండో దశలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలైన యాదాద్రి, బాసర, వేములవాడ, భద్రాచలం ఆలయాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలను త్వరితగతిన అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు కొనసాగుతుందన్నారు. ఓ వైపున ఆలయాలను అభివృద్ది చేస్తూనే మరోవైపు భక్తుల వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. దేవాదాయ శాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామని చెప్పారు. దేవాదాయ శాఖలో పారదర్శకత పెంపోందించాడానికి , అర్జీదారుల ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించడానికి ఇ- ఆఫీసు విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించి సాఫ్ట్వేర్ను ఐటీ ఆండ్ సీ శాఖ రూపోందిస్తుందన్నారు. ఆన్ లైన్ సేవలకు సంబంధించి కూడా ఐటీ అండ్ సీ శాఖ సహాకారం తీసుకుంటున్నామని చెప్పారు. దేవాదాయ శాఖలో ఉన్న రికార్డులను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రెవెన్యూ శాఖ చేపట్టిన సమగ్ర భూసర్వే వల్ల దేవాదాయ శాఖ ఆలయ భూములకు సంబంధించి ఖచ్చితత్వం పెరిగిందని, ఆలయాల పేరు మీద పట్టా పాస్ బుక్కులు జారీ అవుతున్నాయన్నారు. కామన్ గుడ్ ఫండ్ ద్వారా చేపట్టే కొన్ని పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు పంచాయతీ రాజ్ శాఖకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, స్థానిక కార్పోరేటర్ ఆకుల రూప, ఆలయ చైర్మన్ నగేష్ ముదిరాజ్, ఈవో నర్సింహులు, సికింద్రాబాద్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్, జీహెచ్ఎంసీ కో ఆప్షన్ సభ్యులు నరసింహా ముదిరాజ్, ట్రస్ట్ సభ్యులు, ఆలయ పూజారులు,ఇతరులు పాల్గొన్నారు.