చేనేత కార్మికులకు గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రులు కేటీ రామారావు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతోపాటు, వృత్తి అభివృద్ది పథకాలను నేతన్నలకు వివరించేలా అన్ని జిల్లాల్లో ప్రత్యేక జిల్లా స్ధాయి నేతన్న సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. పూర్వ మెదక్ జిల్లాలోని టెక్సటైల్ రంగంపైన ఈరోజు సాగునీటి శాఖా మంత్రి హరీష్ రావు, ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి ఈరోజు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈమేరక జిల్లాస్ధాయి నేతన్న సదస్సును తొలుత సిద్దిపేటలో నిర్వహించాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అధికారులు మంత్రులు సూచించారు. సిద్దిపేట గొల్లభామ చీర కు మరింత ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు రాష్ట్రంలోని అన్ని గోల్కొండ షోరూమ్ లలో వీటిని అందుబాటులో ఉంచుతామని మంత్రులు చెప్పారు. సిద్దిపేట, దుబ్బాక లో ప్రత్యేక చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావు కోరారు. అదే రీతిలో దుబ్బాక, చేర్యాల, సిద్దిపేటలోని అసంపూర్తిగా ఉన్న సోసైటీల భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ నుంచి అవసరం అయిన నిధులు మంజూరు చేయాలని మంత్రి హరీష్ రావు కోరగా, మంత్రి కేటీఆర్ అందుకు అంగీకారం తెలిపారు. ఉపసభాపతి పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి , చింత ప్రభాకర్ ,సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి , సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.