×

తెలంగాణ లో  విద్యను పటిష్టం చేస్తున్నాం -కడియం

తెలంగాణ లో  విద్యను పటిష్టం చేస్తున్నాం -కడియం

వరంగల్, జూలై 04 :  జనగామ జిల్లా కొడకండ్ల గురుకుల విద్యాలయంలో హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ పంపిణీ  ప్రారంభిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ఈ ఏడాది నుంచి పాఠశాలల అప్ గ్రేడ్ అయిన 33 విద్యాశాఖ గురుకులాల ఇంటర్ కాలేజీల తరగతులను కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కొడకండ్ల గురుకుల కాలేజీలో 2.50 కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యార్థినిల డార్మిటరీ భవనాన్ని, సీసీ రోడ్లను ప్రారంభించి, 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న కాలేజీ అదనపు తరగతి గదులకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేడు శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు తన జన్మదినాన్ని గురుకుల విద్యార్థినిల మధ్య జరుపుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు కేక్ ను కట్ చేసి ఎమ్మెల్యే దయాకర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టిన రోజును విద్యార్థినుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

గురుకుల కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణలో చదువుకున్న విద్యార్థి ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడేవిధంగా ఉండాలన్న సిఎం కేసిఆర్ ఆదేశాల మేరకు నేడు తెలంగాణ లో  విద్యను పటిష్టం చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఈ నాలుగేళ్లలోనే 573 గురుకుల పాఠశాలలు, 191 గురుకుల జూనియర్ కాలేజీలు, 53 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ప్రారంభించుకున్నామని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం వీటి నిర్వహణ కోసం ఏటా 3500 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. గురుకుల విద్యాలయాల్లో చదివే విద్యార్థులపై ఒక్కొక్కరి మీద లక్ష రూపాయలకు పైగా వ్యయం చేస్తున్నామని చెప్పారు. గురుకుల విద్యాలయాల వ్యవస్థను ప్రారంభించిందే ఇక్కడి నుంచి అని తెలిపారు. 1972లో పీవీ ఈ గురుకుల విద్యకు ఆద్యుడు కాగా, 1983లో ఎన్టీ రామారావు మరిన్ని గురుకుల విద్యాలయాలను ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ గురుకులాల డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ మల్లేషం ఇతర అధికారులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed