తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనం రీతిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం
తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనం కలిగే రీతిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సాగుతున్నదనీ, అదే తరహాలో, కాల్వల నిర్మాణం, చెక్ డాంల నిర్మాణం, చెరువులను నింపుకోవడం కూడా జరగాలని, తదనుగుణంగా వివరంగా అధ్యయనం చేసి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ కోసం ఒక ఉజ్వలమైన భవిష్యత్ రూపకల్పనలో భాగమే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమని ఆయన అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన రిజర్వాయర్ల నిర్మాణం, కాల్వల నిర్మాణం, పంప్ హౌజుల నిర్మాణం, చెక్ డాంల నిర్మాణం, టన్నెల నిర్మాణం, రిజర్వాయర్లు రాబోతున్న స్థలాలలో వసతి గృహాల నిర్మాణం లాంటి అంశాలపైన సీఎం సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో సాగునీటి శాఖపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సాగునీటి శాఖ మంత్రి టీ. హరీష్ రావు, ఈఎన్సీ మురళీధర్ రావు, సీఈ హరే రాం, పార్లమెంటు సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, మైనింగ్ కార్పోరేషన్ చైర్మన్ సేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ సలీం, సీఎంఓ అధికారి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అప్పర్ మానేరు ఎట్టి పరిస్తితుల్లోనూ ఎండిపోయే అవకాశం లేదనీ, అప్పర్ మానేరు నుండి లోయర్ మానేరు ఒక జీవధార లాంటిదనీ, ఇప్పుడు జరుగుతున్న పనులు పురోగతి సాదిస్తున్నాకొద్దీ, కరీంనగర్ జిల్లా దక్షిణ ప్రాంతం ఎప్పుడూ లైవ్ గా వుంటుందని అన్నారు. అలాగే కాకతీయ కాలువ మరో జీవధార అనీ, గోదావరి మీద కడుతున్న బారేజీల వల్ల ఉత్తర కరీంనగర్ కూడా ఒక జీవధార లాగా అవుతుందనీ, ఒక్క కరీంనగర్ జిల్లాలోనే వివిధ రకాల సాగునీరు అందడం మూలాన నాలుగు జీవదారలు ఎల్లప్పుడూ వుంటాయనీ సీఎం అన్నారు. దీనివల్ల నిత్యం పచ్చదనంతో పాటు, హరితహారానికి కూడా మేలు జరుగుతుందన్నారు. అలాగే సింగూర్ ఒకసారి నిండుతే ఐదు సంవత్సరాల దాకా ఇబ్బంది వుండదనీ, సింగూర్ నుండి కొండపోచమ్మ, మల్లన్న సాగర్ వరకూ కూడా జీవదారేననీ, దీని వల్ల మెదక్ జిల్లాకున్న మెతుకుసీమ అనే పేరు సార్థకమవుతుందని చెప్పారు.
ఈ ఏడాది జులై-ఆగస్టు నాటికల్లా మిడ్ మానేరు నింపడం సాధ్యమవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఎస్సారెస్పీ ఎప్పటికీ నిండి నీళ్ళతో వుండాల్సిన అవసరం వుందని, దీనిమీదే మిషన్ భగీరథ ఆధారపడి వుందనీ సీఎం అన్నారు. మిడ్ మానేరులో నీళ్ళు వచ్చే సరికల్లా బారేజులన్నీ పూర్తీ కావాలని అన్నారు సీఎం. మిడ్ మానేరు నుండి అనంతగిరివరకు ఓపెన్ చానెల్ అయిపోయిందనీ, మిగిలిపోయిన టన్నెల్ పనులు కూడా త్వరగా పూర్తీ చేయాలనీ ఆయన అధికారులకు చెప్పారు. అనంతగిరి, రంగానాయాక్ సాగర్ రిజర్వాయర్ల పనులు కూడా వేగవంతం చేయాలని సీఎం అన్నారు.
కరువు ప్రాంతాలు సస్యశ్యామలం కావడానికి ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా సాగునీరు ఇవ్వాలనీ, వచ్చిన నీళ్ళు వచ్చిన వెంటనే చెరువులు నింపుకుంటూ పోవాలనీ సూచించారు. వచ్చే వర్షాకాలం నాటికి పూర్తీ ఉపయోగంలోకి రావాలంటే చెరువులు నింపడం తప్పనిసరి అని ఆయన అన్నారు. మిడ్ మానేరు నుండి నీళ్ళతో చెరువులు, చెక్ డాంలు నింపాలన్నారు. అనంతగిరి, రంగానాయక్ సాగర్ లోకి ఎత్తిపోసే పంప్ హౌజ్ పనులను కూడా వేగవంతం చేయాలని సీఎం చెప్పారు. మల్లన్న సాగర్ కింద వుండే కాల్వల పనులను కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. మల్లన్న సాగర్ నుండి సింగూర్ కు గ్రావిటి ద్వారానే నీళ్ళు పోవాలన్నారు. గ్రావిటి మార్గంలో ఎక్కువ ప్రాంతం సాగులోకి వచ్చే అవకాశం వుందన్నారు. జాతీయ రహదారి నుండి మెదక్ పట్టణం వరకూ, అలాగే గజ్వేల్, దుబ్బాక, సిద్ధిపేట నియోజక వర్గాలలో ఒక్క కుంట భూమి కూడా మిగలకుండా సాగులోకి రావాలని సీఎం చెప్పారు.
గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్ల పనుల పురోగతిని కూడా ముఖ్యమంత్రి అదికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే గంధమల దాకా, అక్కడి నుండి బస్వాపూర్ దాకా కాల్వల నిర్మాణం పురోగతిని సమీక్షించారు. గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్లు ఎంత త్వరగా పూర్తవుతే అంత త్వరగా ఫలితాలుంటాయని ఆయన అన్నారు. గంధమల, బస్వాపూర్ భూసేకరణ పురోగతిని కూడా సమీక్షించారు.
మొత్తం తెలంగాణలో వున్న మంజీరా, దుందుభి, కనగల్ వాగు, మూసీ, పాకాల లాంటి ఉపనదుల మీద చెక్ డాంల నిర్మాణం జరగాలని సీఎం అన్నారు. ఒక్క సారి ఈ చెక్ డాంలు, చెరువులు పూర్తిగా నిండితే చాలనీ, ఇక ఎప్పుడూ ఆ నీరు సర్క్యులేట్ అవుతుంటే పంటలు పండుతూ ఉంటాయని ఆయన అన్నారు. 2020 కల్లా మనం అనుకున్న తెలంగాణ వస్తుందనీ, అంతా అద్భుతంగా వుండబోతున్నదనీ ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.
మల్లన్నసాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ లాంటి రిజర్వాయర్లున్న చోట అద్భుతమైన వసతి గృహాలను నిర్మించడానికి చర్యలు చేపట్టాలని మంత్రి హరీష్ రావుకు చెప్పారు సీఎం. ఈ వసతి గృహాలు మంచి ఎత్తైన ప్రదేశాల్లో, సుమారు 20-30 ఎకరాల స్థలంలో నిర్మిస్తే బాగుంటుందని సూచించారు. ఘన్ పూర్, మఖ్తల్ కింద, నిజామాబాద్ దగ్గర రెండు వాగుల మీద, బాలకొండ నియోజక వర్గం రామడుగు డౌన్ స్ట్రీం దగ్గర, మంజీర మీద, సింగూరు మీద చెక్ డాంల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చెప్పారు.
Post Comment