తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన దసరా పండుగ రోజే అతిపెద్ద పరిపాలనా సంస్కరణల అమలు ప్రారంభం కావడం శుభసూచకమన్నారు. ఈసారి మంచి వర్షాలు పడడంతో మిషన్ కాకతీయ ద్వారా బాగుపడిన చెరువులు నిండాయని, నీటి అలలపై బతుకమ్మలు నాట్యమాడిన అద్భుత సన్నివేశం తెలంగాణ అంతటా కనిపించాయన్నారు. అదే స్పూర్తి, ఉత్సాహంతో దసరా పండుగ కూడా జరుపుకోవాలని ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈసారి మంచి కాలం కావడంతో రైతులు కూడా సంతోషంగా ఉన్నారని, రబీ పంటల కోసం ఇప్పటి నుండే ప్రభుత్వం సిద్దమవుతున్నదన్నారు. రైతుల డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అత్యంత ఆశావహ దృక్పథం తెలంగాణలోని అన్ని వర్గాల్లో వుందని, భగవంతుడు కూడా తెలంగాణను ఆశీర్వదిస్తున్నాడన్నారు. దసరా పండుగ రోజే జరిగే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని దీవించాలన్నారు. జమ్మి చెట్టు పూజ, రావణాసుర వధ, పాలపిట్ట దర్శనం తదితర సంప్రదాయ కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.