*తెలంగాణ ఓటరుకోసం ‘నా ఓటు’*

డిసెంబరు 7న ఓటింగ్ ముహూర్తం  దగ్గరపడుతున్న కొద్దీ ఓటరు సౌకర్యవంతంగా వెళ్ళి సులభంగా ఓటువేసి రావడానికి ఎన్ని అవకాశాలున్నాయో వాటిని ఆచరణలోకి తీసుకు రావడం జరుగుతున్నది.  ఈ దిశగా ఇప్పటికే చాలా యాప్‌లను ప్రవేశపెట్టగా ఇప్పుడు కొత్తగా గురువారం ‘నా ఓటు’ అనే మరో అధునాతన, బహుళ ప్రయోజనకర యాప్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆవిష్కరించారు.

ఆండ్రాయిడ్, ఐఓస్ అనే రెండు ఆపరేటింగ్ సిస్టమ్ ల మీద పనిచేసే ఈ యాప్ ద్వారా ఓటరుకు కలిగే ప్రయోజనాలు-ఎపిక్ నంబరు, పేరు క్షణాల్లో వెతికి పట్టుకోవడం, ఎపిక్ నంబరు లేదా ఓటరు పేరుతో పోలింగ్ స్టేషన్ ఏదో, దానికి వెళ్ళడానికి దగ్గర దోవ, అక్కడికి చేరుకోవడానికి వీలయిన బస్టాప్, రైల్వే స్టేషన్ ఎక్కడున్నాయో తెలుసుకోగలగడం, అన్నిటికీ మించి తన నియోజక వర్గం వివరాలు, అక్కడ ఎవరెవరు పోటీలో ఉన్నదీ తెలుసుకోవడం. ఇక దివ్యాంగ ఓటర్లకయితే పోలింగ్ బూత్‌కు వెళ్ళిరావడానికి రవాణా సౌకర్యం కల్పించమని విన్నవించుకోవడం వంటి అంశాలు ఉన్నాయి.

ఈ యాప్‌ను తెలంగాణ రాష్ట్రంలోని ఓటర్లు ఉచితంగా వారి వారి స్మార్ట్ ఫోన్‌లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

*నా ఓటుకు లోగో డిజైన్ చేసి పంపితే రు.15వేలు బహుమతి*

తెలంగాణ ఓటరు కోసం కొత్తగా ఆవిష్కరించబడిన ‘నా ఓటు’ అనే అధునాతన యాప్‌కు ఆకర్షణీయంగా, అర్థవంతంగా లోగోను డిజైన్ చేసి పంపినవారికి రు.15వేలు బహుమతి ఇస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డా.రజత్ కుమార్ ప్రకటించారు.

దీనిలో ఎవరయినా పాల్గొనవచ్చనీ, ఎంట్రీలను నవంబర్ 30నుండీ డిసెంబరు 6 వ తేదీ సాయంత్రం 5గంటలలోగా పంపాలని, ఉత్తమ ఎంట్రీని డిసెంబరు 10న ప్రకటిస్తామని ఆయన తెలియచేసారు. దరఖాస్తులను   naavotets@gmail.com మెయిల్‌కు పంపాల్సి ఉంటుంది.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.