* తెలంగాణలో పల్లెప్రగతి పురోగతిపై ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల ప్రశంస
* గ్రామీణాభివృద్ధిశాఖ చేపడుతున్న పనులపై సంతృప్తి
* జిల్లాల విభజన, గ్రామీణాభివృద్ధి శాఖల ఏకీకరణతో పల్లె ప్రగతి మరింత వేగంగా సాధ్యమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన ప్రపంచ బ్యాంక్ బృందం.
* దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపోందించాం.
* తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
తెలంగాణలో గ్రామీణాభివృద్ధి శాఖ చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమ పురోగతిపై ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ప్రపంచ బ్యాంక్ సౌత్ ఇండియా హెడ్ శోభాశెట్టి, ప్రతినిధులు సీతారామచంద్ర, వినయ్ కుమార్, బాలకృష్ణ లు బేటి అయ్యారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలను తీర్చిదిద్దేలా కార్యచరణతో ముందుకు వెలుతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే లక్ష్యంతో కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకుపోతామన్నారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంపై చర్చించారు. పల్లె ప్రగతితో పాటు తెలంగాణలో చేపడుతున్న ఉపాధిహామి పనులను ప్రశంసించారు. జిల్లాల విభజన, డ్వామా, డీఆర్డీఏ శాఖల విలీనం వల్ల పల్లె ప్రగతి కార్యక్రమం మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం ఉంటుందనే ఆశాభావాన్ని శోభాశెట్టి వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు.