తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఇతర అధికారులతో సిఎం సమీక్ష

తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కలెక్టర్లను కోరారు. నాటిన మొక్కను బతికించి, పెద్ద చేసేందుకు అనుసరించే కార్యాచరణను రూపొందించాలని సిఎం ఆదేశించారు.

తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఇతర అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న హరితహారం కార్యక్రమంపై సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలందరూ భాగస్వాములు కావడం పట్ల సంతోషం తెలిపారు. మొక్క నాటగానే సంబురం కాదని, అవి పెరిగి పెద్దగవడం చాలా ముఖ్యమని సిఎం చెప్పారు. మొక్కలను బతికించడం కోసం జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. కలెక్టర్లతో సమన్వయం కుదుర్చుకుని రాష్ట్ర వ్యాప్త కార్యాచరణ తయారు చేయాలని సిఎస్ ను ఆదేశించారు. ప్రతీ ప్రభుత్వ శాఖ పరిధిలో కూడా ఈ సారి పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారని, వాటికి నీళ్లు పోయడం, రక్షించడం కోసం కూడ వారు బాధ్యత తీసుకోవాలని సిఎం కోరారు. ప్రతీ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాన్ని కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ప్రభుత్వానికి నివేదిక పంపాలని, కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కలెక్టర్లకు ప్రత్యేక మొమో జారీ చేశారు. ‘‘జిల్లా కలెక్టర్లు సెక్టార్ల వారీగా సూక్ష్మస్థాయి ప్రణాళిక సిద్ధం చేయాలి. వర్షాలు కురవని రోజుల్లో మొక్కలకు ఏ విధంగా నీరు అందిస్తారో కార్యాచరణ రూపొందించుకోవాలి. సదరు కార్యాచరణ ప్రణాళికను అటవీశాఖ ముఖ్య కార్యదర్శికి పంపాలి. ప్రతీ వారానికోసారి నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తాను’’ అని కలెక్టర్లకు పంపిన మెమోలో సిఎస్ పేర్కొన్నారు.

‘‘మొక్కలను బతికించడం చాలా ముఖ్యం. జిల్లాలు, డివిజన్లలో అందుబాటులో ఉన్న ఫైర్ ఇంజన్లను మొక్కలకు నీరు పోయడానికి ఉపయోగించుకోవాలి. మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు, గ్రామ పంచాయితీల్లో ఉన్న మంచినీటి ట్యాంకర్లను కూడా వాడి మొక్కలకు నీరు పోయాలి’’ అని మెమోలో వివరించారు. పోలీసు శాఖ కూడా మొక్కలను బతికించడం కోసం వర్షాలు లేని సమయంలో నీళ్లు పోయడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించుకోవాలని డిజిపిని కోరారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal