విశేషాలు: తిరుప్పావు లో మొదటి మేల్కొల్పు పాశురం
పుళ్ళుమ్ శిలుంబినకాణ్ పుళ్ళరయ్యన్ కోయిలిల్
వెళ్ళై విళిశంగిన్ పేరరవమ్ కేట్టి లైయో
పిళ్ళా యెళుంది రాయ్ పేయ్ ములై నంజుణ్డు
కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల మర్ న్ద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుమ్ యోగిగళుమ్
మెళ్ళ వెళున్దు ఆరియన్ర పేరరవమ్
ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.
అర్థం:
ఇంతవరకు వ్రతమును ఆచరించుటకు పూర్వ రంగం సిద్ధం అయింది .
గోదాదేవి ఒక చెలియ ఇంటికి వెళ్లినది. తన చెలి ఇంకా నిదురించుట చూసి , ఆమెను నిద్ర లేపుతున్నది.
“ఓ ఇంతి! ఆహారము సేకరించుటకు పక్షులు బయలుదేరినవి.ఆ పక్షులకు రాజైన గరుత్మంతునికి స్వామియగు విష్ణు భగవానుని దేవాలయంలో శంఖనాదం నీకు వినబడలేదా?
పూతన స్తనముల నుంచి విషమును త్రాగినవానిని, మాయా శకటమును కాలితో తన్నిన వానిని హృదయమందు నిలుపుకొన్న మునులు,యోగులు తమ హృదయంలో నెలకొన్న స్వామికి నిద్రాభంగం కలుగ కూడదని,మెల్లగా లేస్తూ హరి హరియని స్మరిస్తున్నారు.వారు చేస్తున్న హరి స్మరణము మా హృదయములను చేరటం చేత మేము నిద్ర లేచాము.నీవు కూడా నిద్ర మేలుకో.మనందరం భగవంతుని పొందుటకు ధనుర్మాస వ్రతమును ఆచరిద్దాము