నోముకు నియమాలు
17.12.2017……రెండవ పాశురం
పాశురం 2:
వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు
చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్
పై యత్తు యిన్ర పరమనడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్రోదోమ్
ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి
ఉయ్యు మారెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.
అర్థం:
లోకులారా! ఈ ధనుర్మాస వ్రత నియమాలను చెబుతాను వినండి. పాల కడలిలో శేషతల్పం మీద పడుకునే పరమాత్ముడైన శ్రీ హరి పాదాలను సదా కీర్తించాలి.ధనుర్మాస వ్రతం పూర్తిగా ఆచరించి ఫలసిద్ధి కలుగు వరకు నెయ్యిని , పాలను స్వీకరించరాదు. ఉదయాత్పూర్వమే నిద్రమేల్కొని స్నానమాచరించాలి.కంటికి కాటుక రాసుకోకూడదు. సిగలో పుష్పములు అలంకరించుకోకూడదు.
శాస్త్రములు నిషేధించిన పనులు చేయకూడదు.మన పూర్వుల మార్గములోనే పయనించాలి. ఇతరులను నిందిచకూడదు.అటువంటి ఆలోచనలు కూడా మన మనస్సులో రానీయకూడదు.దాన ధర్మములు చేయాలి. భగవంతుని తెలుసుకోవాలనుకునే వారికి స్వామి వైభవాలను తెలియజేయాలి.
పాశురంలోని అంతరార్థం:
ఈ పాశురంలో అధికారికి ఉండవలసిన లక్షణాలను, వ్రత నియమాలను గోదాదేవి తెలియజేస్తుంది.
భగవత్సన్నిధిని ఆశించే వారు శాస్త్ర విరోధ పనులను చేయకూడదు.మన ప్రాచీనులు నడచిన మార్గంలోనే పయనించాలి. భోగ వస్తువులను విడిచిపెట్టాలి.”ఆత్మవత్ సర్వభూతేషు” అన్నట్లు అందరిలోను తనను దర్శించాలి.పరనిందకూడదు.పై లక్షణాలన్నీ కలిగి సదా సర్వకాలము పరమాత్ముడైన వైకుంఠనాథుణ్ణి స్మరించాలి.ఇవన్నీ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించే శ్రీవైష్ణులకు సహజ లక్షణాలు.