17వ పాశురము
అమ్బరమే , తణ్ణీరే శోఱే అఱమ్ శెయ్యుమ్
ఎమ్బెరుమాన్ ! నన్దగోపాలా! ఎళున్దిరాయ్,
కొమ్బనార్కెల్లామ్ కొళున్దే ! కులవిళక్కే
ఎమ్బెరుమాట్టి! యశోదాయ్! అఱివురాయ్!
అమ్బర మూడఱుతోజ్ఞ్గి యులగలన్ద
ఉమ్బర్ కోమానే ! ఉఱజ్ఞ్గాదెళున్దిరాయ్
శెమ్ పొర్కళ లడిచ్చెల్వా ! బలదేవా !
ఉమ్బియుమ్ నీయు ముఱజ్ఞ్గేలో రెమ్బావాయ్.
పాశురంలో విశేషం:
గోపికలందరూ నందగోపభవనములోకి ప్రవేశించినారు.నందగోపుడు , యశోద, శ్రీ కృష్ణుడు, బలరాముడు వరసగా మంచాలపై శయనించినారు. వారిని ఈ రోజు మేలుకోల్పుతున్నారు. రాక్షసులు వచ్చి కృష్ణునికి ఏమి కీడు చేస్తారో అని ! లేక గోపికలు ఎత్తుకుపొతారెమో ! అని భయముతో , ముందు మంచము మీద నందుడు శయనించియుండెను. లేక లేక కలిగిన బిడ్డడని కృష్ణుని వీడ లేక ఒక ప్రక్క కృష్ణుని మరో పక్క బలరాముని మధ్యలో యశోద శయనించి యుండెను. వారిని ఒక్కొక్కరిని ఈ పాశురంలో
మేలుకొల్పుతున్నారు.
అర్థం:
వస్త్రములు కావలసినవారికి వస్త్రములు, మంచి నీరు , అన్నము కావలసినవారికి అన్నము,ప్రతిఫలాపేక్ష లేక ధర్మ బుద్ధితో దానము చేయు నందగోపాలా! మా స్వామీ! మేల్కొనుము . ప్రబ్బలి చెట్ల వంటి సుకుమారములగు శరీరములు గల స్త్రీలలో చిగురువంటిదానా! మా వంశమునకు మంగళ దీపము వంటిదానా! యశోదా దేవి! మేలుకొనుము. ఆకాశ మధ్య భాగమును చీల్చు కొని పెరిగి లోకముల నన్నిటిని కొలిచిన త్రివిక్రమా ! నిత్యసురులకు నాయకుడా! నిద్ర పోకూడదు. మేల్కొనుము. స్వచ్ఛమైన ఎర్రని బంగారుముతో చేయబడిన కడియము కాలిని దాల్చిన బలరామా! నీవును, నీ తమ్ముడును మేల్కొనవలెను.
అని గోపికలు ప్రార్ధించిరి.