30 వ పాశురము
వఙ్గ క్కడల్ కడైన్ద మాదవనై కేశవనై
తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళై యార్ శెన్నిరైఞ్జి
అఙ్గప్పరై కొణ్డువాత్తై, అణిపుదువై
పైఙ్గమల త్తణ్డైరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న
శఙ్గత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే
ఇఙ్గప్పరిశురై ప్పారీరరణ్డు మాల్వరైత్తోళ్
శె ఙ్గణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తిన్బురువ రెమ్బావాయ్
*భావం : ఓడలుగల పాల సముద్రమును దేవతలకోసం మధించి, వారికి అమృతాన్ని ప్రసాదించినవాడును, బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రముఖలైన గోపికలు ఆలంకృతులై చేరి, మంగళాశాసనము చేసి, గోకులమునందు ‘పఱై’ అను వంకతో స్వామి కై౦కర్యమును పొందారు.
వీరు పొందిన యీ కై౦కర్య విధమునంతను అలంకారమైన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించినట్టియును, తామర పూసల మాలలను ధరించిన పేరియాళ్ళార్ల (విష్ణుచిత్తుల) పుత్రికయైన గోదాదేవి (అండాళ్ తల్లి) సాయించింది. ఇది గోపికలు గుంపులు గుంపులుగ కూడి అనుభవించిన ప్రబంధమై, ద్రావిడ భాషలో పాశురరూపంగా ప్రవహించింది.
ఈ ముప్పుది పాశురాలను ఒక్కటిని కూడా విడువకుండ యీ సంసారమున అనుసంధి౦చువారు గొప్ప పర్వతవలెనున్న నాల్గు భుజములును ఆశ్రిత వాత్సల్యముచే ఎఱ్ఱబారిన కనుదోయిగల శ్రీముఖమును. ఉభయ విభూతి ఐశ్వర్యములందునుగల శ్రియ: పతియొక్క సాటిలేని దివ్య కృపను పొంది, బ్రహ్మనందముతో కూడినవారై యుండగలరు. శ్రీ గోదా రంగనాథుల అవ్యాజకృపచే యీ ‘తిరుప్పావై’ ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగున’ శ్రీసూక్తిమాలిక’ గ’ ప్రవహింపచేసి పాడించుకున్న వారి దివ్యవాత్సల్యమునకు యీ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృతజ్ఞతాంజలులు ఘటిస్తున్నాడు.
శ్రీ సూక్తి మాలిక సంపూర్ణమ్
శ్రీ అండాళ్ దివ్య తిరువడిగళే శరణమ్
ఫలశ్రుతి-
*ఇది ధనుర్మాస వ్రతంలోని 30వ (మాలిక) ఈ వ్రతాన్ని చేసినవారికి లభించే ఫలాన్ని గూర్చి వివరించిన (మాలిక). ఎన్నడో ద్వాపర యుగంలో వ్రేపల్లెలోని గోపికలాచరించిన కాత్యాయనీ వ్రతాన్ని శ్రీ అండాళ్ తల్లి కలియుగంలో తానాచరించి తరించింది. ఈ 30 రోజుల వ్రతానుష్టానం వలన _ భక్తి ప్రవత్తులతో భగవంతుని సాన్నిధ్యాన్ని పొందవచ్చునని నిరూపించింది తల్లి. అత్యంత నిష్టతో ఆచరించిన యీ వ్రతంవలన అజ్ఞానులు సైతం భగవత్సాక్షాత్కారాన్ని పొందగలరని నిరూపించింది. తాను అనుసరించి, యితరులచే అనుసరింపచేసి మార్గదర్శుకురాలై, ఆచార్య పురుషకారాన్ని వహించి మనబోటివారలను తరింపచేయ సమకట్టి, తల్లి మనకనుగ్రహించినదీ వ్రతాన్ని. ఈ ‘తిరుప్పావై’ దివ్య ప్రపందాన్ని అనుసంధించి మనమూ తరిద్దా౦! -జై శ్రీమన్నారా యణ . – అందరికి ధన్యవాదాలు .