అమరావతి: తాను కూడా ప్రలోభాలు పెడితే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, డోర్ తెరిస్తే అక్కడ ఎవరూ ఉండరని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. స్పీకర్ కు ధన్యవాద తీర్మానం సభలో చంద్రబాబు వ్యాఖ్యలపై వైయస్ జగన్ మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే సభలో ఏరకంగా చట్టాలకు తూట్లు పొడిచారో..ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్న పరిస్థితి చూశాం. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయలేదు. వారిలోనే నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ముఖ్యమంత్రి, అటువంటి స్పీకర్ ఉన్న చట్టసభ కాకుండా..మంచి స్పీకర్‌ను దేవుడి దయతో కూర్చోబెట్టాం. మనం ఎలా చేయాలో ఉదాహరణ ఇస్తు ఇదే సభలో చెప్పాను. నేను కూడా చంద్రబాబు మాదిరిగా అలాగే చేసి ఉంటే చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో కూర్చునే వాడు కాదు. నేను కూడా డోర్ తెరిస్తే ఎంతమంది టచ్‌లో ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. ఈ అన్యాయమైన సాంప్రదాయం కొనసాగకూడదని, చట్టసభలో ప్రతిపక్షం ఉండాలని, చంద్రబాబుకు ఇంకా ఆ స్థానంలో కూర్చొబెట్టేందుకు, మంచి సాంప్రదాయం రావాలని, మంచి చేసే దిశగా మాట్లాడుతుంటే దాన్ని కూడా వక్రీకరిస్తూ అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నారు. 23 మంది వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ముగ్గురు ఎంపీలను ప్రలోభపెట్టి తీసుకున్నారు. చివరికి ఏం జరిగింది. పైన దేవుడు ఉన్నారు. ప్రజలు ఉన్నారు. ఏ స్థాయిలో గూబ గువ్వ్ అనే విధంగా జవాబు చెప్పారు. దేవుడు కూడా కరెక్టుగా మే 23వ తేదీన జడ్జిమెంట్ఇచ్చారు.
స్పీకర్‌ను తన సీట్లో కూర్చోబెట్టే విషయంలో చంద్రబాబు ముందుకు రాకపోవడం బాధాకరమని, ఆయన చేసిన తప్పు నకు క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్పీకర్‌కు ధన్యవాద సభలో సీఎం మాట్లాడుతూ.. స్పీకర్‌గా తమ్మినేని సీతారంను ఏకగ్రీవంగా ఎన్నుకున్న తరువాత..ఇక్కడ ఉన్న అన్ని పార్టీల నేతలు వచ్చి స్పీకర్‌ను తన సీట్లో కూర్చోవాలని ప్రోటెం స్పీకర్ అన్నారు. ఆ తరువాత సాదరంగా నేను లేచి, మిమ్మల్ని ఆలింగనం చేసుకొని, గౌరవప్రదంగా మిమ్మల్ని మీ సీట్లో కూర్చొబెట్టాం. చంద్రబాబు అక్కడి నుంచి లేయలేదు. అచ్చెన్నాయుడు మాత్రమే వచ్చారు. ఇంత ప్రక్రియ సాక్ష్యాత్తు కళ్లెదుటే జరిగితే కూడా దాన్ని తప్పు అని కూడా గ్రహించకుండా కప్పిపుచ్చుకుంటున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు వందసార్లు చెప్పిందే చెప్పి అదే నిజం అన్నది ఒక సామెత. అదే చంద్రబాబు చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ అందరిని ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని మన్నించి స్పీకర్ వద్దకు రావాల్సింది పోయి. బొట్టు పెట్టలేదని పేర్కొనడం సరైంది కాదు. స్పీకర్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రావాల్సింది పోయి చంద్రబాబు దారుణంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఇంతకన్నా దీన్ని ఎక్కువగా సాగదీయకూడదు.