* ఢిల్లీలో డాక్టర్ శ్రీధర్ రెడ్డి రచించిన పుస్తకం ఆవిష్కరణ
విజయవాడ: విజయవాడకు చెందిన దంతవైద్యుడు డాక్టర్ ఎ.శ్రీధర్ రెడ్డికి “పియరీ ఫాచర్డ్ అకాడమీలో గౌరవ సభ్యత్వం (ఫెలోషిప్) అందించారు. న్యూఢిల్లీలోని మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్‌స్‌లో జరిగిన అకాడమీ 32వ స్నాతకోత్సవంలో డాక్టర్ శ్రీధర్ రెడ్డికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇదే సభలో శ్రీధర్ రెడ్డి రచించిన “డెంటిస్టీ ఈజ్ మై పేషన్” అనే ఆంగ్ల పుస్తకాన్ని మౌలానా ఆజాద్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డెంటల్ డైరెక్టర్ పద్మశ్రీ ప్రొఫెసర్ మహేశ్ వర్మ, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డెంటల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఒ.పి. కర్బందా, ఐ.డి.ఎ. నేషనల్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ అశోక్ దోబ్లే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి దంత వైద్య రంగతంతో పాటు సామాజిక రంగానికి అందించిన సేవలను, ఇటీవల సాధించిన గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పడాన్ని ప్రస్తావిస్తూ కొనియడారు. ఆయన రచించిన గ్రంధం దంతవైద్య విద్యార్థులకు డెంటిస్టుగా ప్రాక్టీసు చేస్తున్న వైద్యులకు అత్యంత ఉపయోగకరమని తెలిపారు. “డెంటిస్టీ ఈజ్ మై పేషన్ గ్రంధంలో డాక్టర్ శ్రీధర్ రెడ్డి ప్రాక్టీసు పెట్టిన తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న సవాళ్లను, వాటిని అధిగమించడానికి తాను చేసిన కృషిని వివరిస్తూ, క్రొత్తగా ప్రాక్టీసు పెట్టే దంత వైద్యులకు తన స్వీయానుభవ నేపధ్యంలో తగిన సలహాలను, దంత వైద్య రంగానికి సంబంధించిన మెళకువలను పొందుపరచారు. దంత వైద్యశాల నిర్వహణంలో కలిగే ఇబ్బందులను, వాటి పరిష్కారాలను సూచించారు. ఈ పుస్తకం దంత వైద్య విద్యార్థులు, వైద్యులు తప్పనిసరిగా చదవాల్సిన గ్రంధమని పలువురు వక్తలు పేర్కొన్నారు.