×

డిసెంబర్ 15 నాటికి తాత్కాలిక హైకోర్టును సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశం

డిసెంబర్ 15 నాటికి తాత్కాలిక హైకోర్టును సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశం

అమరావతి, జులై 4 : వైకుంఠపురం రిజర్వాయర్ దగ్గర కృష్ణానదిపై నిర్మించనున్న వారధిని ఐకానిక్ నిర్మాణంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిని అమరావతికి అనుసంధానం చేస్తూ కృష్ణానదిపై నిర్మించే డజనుకు పైగా వారధులన్నీ రాజధానికే మకుటాయమానంగా నిలవాలని ఆయన స్పష్టంచేశారు. రాజధాని నగరంలో చేపట్టిన రహదారుల నిర్మాణాలు డిసెంబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. నిర్మాణంలో వేగం పుంజుకుంటే తప్ప నిర్దేశిత వ్యవధిలో పనులను పూర్తి చేయడం సాధ్యం కాదని అన్నారు. ముఖ్యంగా సీడ్ యాక్సెస్ నిర్మాణం మరింత చురుగ్గా సాగాలని చెప్పారు.
బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో సీఆర్‌డీఏ 17 వ అథారిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రాజధాని అభివృద్ధి పనులను సమీక్షించారు. సీడ్ యాక్సెస్ రహదారి, సబ్ ఆర్టియల్ రహదారుల నిర్మాణాలలో జాప్యానికి గల కారణాలను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఒక్కొక్క రహదారికి 150కి పైగా యుటిలిటీ క్రాసింగ్స్ వున్నాయని, వాటి నిర్మాణాలను పూర్తి చేస్తే కానీ, రహదారుల నిర్మాణాలను పూర్తి చేయలేమని అమరావతి అభివృద్ధి సంస్థ సీఎండీ లక్ష్మీ పార్ధసారధి ముఖ్యమంత్రికి వివరించారు. రాజధాని పరిధిలోని కొన్ని గ్రామాలలో భూ సేకరణ ప్రక్రియ పూర్తి కాకపోవడం కూడా రహదారుల నిర్మాణాలకు ప్రధాన అడ్డంకిగా మారిందని చెప్పారు. సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణంలో 63శాతం పని పూర్తయ్యిందని, రూ.140.60 కోట్ల మేర నిధులను ఖర్చు పెట్టామని తెలిపారు. సీడ్ యాక్సెస్, ఇతర సబ్ ఆర్టియల్ రహదారులన్నింటికీ కలిపి ఇప్పటి వరకు రూ.1,196 కోట్ల మేర నిధులు వెచ్చించామని చెప్పారు. సాధారణ ప్రభుత్వ విధానాలతో కాకుండా వృత్తి నైపుణ్య పద్ధతులను అనుసరించడం ద్వారా మాత్రమే నిర్ధిష్ట లక్ష్యాలను సాధించగలుగుతామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ప్రాజెక్టు మేనేజ్‌మెంటులో చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటి వరకు వీజీటీఎం ఉడా పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులను సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. ప్లానింగ్, ఇంజనీరింగ్, అడ్మిన్‌స్ట్రేషన్, క్లాస్ 4 ఉద్యోగులను మొత్తం నాలుగు కేటగిరిలలో తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
ప్రతి ఆదివారం డ్రోన్ సహాయంతో తీసిన చిత్రాల ద్వారా రెండు సెం.మీ. పనుల పురోగతిని కూడా త్రిడీ గ్రాఫిక్స్‌లో విజువలైజ్ చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిర్మాణ సామాగ్రిని సమకూర్చుకోవడం దగ్గర నుంచి నిర్మాణంలో పాలు పంచుకునే కార్మిక సిబ్బంది పనితీరు వరకు సమస్తం డ్రోన్ల ద్వారా చిత్రీకరిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వర్చువల్ పద్ధతిలో నేరుగా క్షేత్రస్ధాయి పనుల పురోగతిని తెలుసుకోవచ్చునని చెప్పారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమరావతి పరిధిలో గల కృష్ణానది తీరంలో శ్రీ వేంకటేశ్వరుని ఆలయ నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. పవిత్ర సంగమ ప్రాంతంలో ఇప్పటికే దీనికి అనుకూలంగా ఉండే స్థలాన్ని గుర్తించారు. టీటీడీ ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టనుంది. రాజధానిలో సొంత ఇళ్లను కొనుగోలు చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ కాంట్రాక్టు ఉద్యోగులు, హైకోర్టు న్యాయవాదులు, ఇతర వర్గాల నుంచి వస్తున్న డిమాండును దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి వెయ్యి గృహాలను వాణిజ్యపరంగా నిర్మించడం కోసం రూపొందించిన ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. 1285, 1580, 1880, 2150 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తారు. చదరపు అడుగుకు రూ.3 వేల ధరను ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.500 కోట్ల వ్యయం కాగలదని అంచనా వేశారు.
రాజధానిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామని, ఇటువంటి వ్యవస్థ దేశంలో ఇదే ప్రథమమని సీఆర్‌డీఏ కమిషనర్ చెప్పారు. అమరావతిలో విద్యాలయాలను నెలకొల్పడానికి 8 ప్రఖ్యాత సంస్థలు ముందుకొచ్చాయని, నిర్మాణాలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఇవిగాక సెయింట్ గేబ్రియల్, ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ సొసైటీ, పీహెచ్ఆర్ ఇన్వెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ, జూబిలీహిల్స్ ఎడ్యుకేషనల్, సొసైటీ ఆఫ్ సెయింట్ మేరీ, ఎన్ఎస్ఎం కూడా దరఖాస్తు చేశాయని తెలిపారు. కొన్ని స్టార్ హోటళ్లు ముందుకొస్తున్నాయని పైవ్ స్టార్ హోటళ్లు 4, ఫోర్ స్టార్ హోటళ్లు 4, త్రి స్టార్ హోటల్ ఒకటి రాజధానిలో త్వరలో నిర్మాణాలను చేపట్టనున్నాయని చెప్పారు. ప్రస్తుతం విజయవాడలో 1700 హోటల్ గదులు అందుబాటులో వున్నాయని, అమరావతి నగరంలో మొత్తం 10 వేల గదులు అందుబాటులోకి తీసుకురావాలన్నదే లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
శాఖమూరులో 7.5 ఎకరాల విస్తీర్ణంలో శిల్పారామం తరహాలో ఏర్పాటు చేయనున్న ఎత్నిక్ విలేజ్‌లో ఎకరం స్థలంలో క్రాఫ్ట్ బజారును ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఏపీ క్రాఫ్ట్ కౌన్సిల్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ముందుంచారు.  రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో హస్తకళలు విశేష ప్రాచుర్యాన్ని పొందాయని, వీటన్నింటికీ అమరావతిలో నిర్మించే ఎత్నిక్ విలేజ్ కేంద్రంగా నిలవాలని ముఖ్యమంత్రి చెప్పారు. కొండపల్లి బొమ్మలు, నరసాపురం లేసులు, మంగళగిరి చేనేత వస్త్రాలు, అనంతపురం తోలుబొమ్మలు వంటి అంతరించిపోతున్న హస్తకళలను బతికించుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రాచీన కళారూపాలకు సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి మెరుగులు దిద్దాల్సి వుందని అన్నారు. గత వైభవంగా నిలిచిన చేనేత చీరను నిన్న మొన్నటి వరకు పట్టించుకునే వాళ్లే లేరని, ఇప్పుడు లక్ష రూపాయిలు పెట్టి నేత చీర కొనడానికి ఉత్సాహం చూపుతున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. హస్తకళల గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ది చేయాలని సూచించారు. రాజధాని ప్రాంతంలో ఉన్న కొండలన్నింటినీ సుందరీకరించాలని, వివిధ రకాల పుష్పజాతులతో ఒక్కొక్క కొండకు ఒక విలక్షణతను తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికోసం అటవీశాఖ, సీఆర్‌డీఏ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పర్యాటకులు, సాహసక్రీడా ప్రియులు, పర్వతారోహకులను ఆకట్టుకునేలా వీటిని తీర్చిదిద్దాలని సూచించారు.
దొనకొండలో నిర్మాణ నగరం
దొనకొండలో నిర్మాణ వస్తు నగరం ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. సింగపూర్ భాగస్వామ్యంతో దీన్ని చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. చైనాలో ఈ తరహా నగరం ఉందని, నిర్మాణాలకు సంబంధించిన సమస్త వస్తు సామాగ్రి ఇక్కడ లభ్యం అవుతుందని చెప్పారు. నిర్మాణ రంగ అవసరాలకు సంబంధించిన తయారీ యూనిట్లు, ఆధునిక సాంకేతికత, సరఫరాదారులు, తయారీదారులిద్దరికీ ఈ నగరం ఉపయుక్తంగా ఉంటుందన్నారు. కేవలం నిర్మాణ సామాగ్రి తయారీ పరిశ్రమలే కాకుండా, నిర్మాణ రంగంలో చోటు చేసుకుంటున్న అనేకానేక మార్పులు, నవ్యావిష్కరణలకు కేంద్రంగా, సాంకేతిక వైజ్ఞానిక కేంద్రంగా వుంటుందన్నారు. దీనికి సింగపూర్ వంటి దేశాల సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. గాలి స్వచ్ఛత, ధ్వని కాలుష్యం, వైపరీత్యాల నిర్వహణ తదితర అంశాలలో అత్యంత ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారని, వీటికి సంబంధించిన నిరంతర పరిశోధనలకు ఈ నిర్మాణ నగరమే మార్గదర్శిగా వుండాలని అన్నారు. దీర్ఘకాలం మన్నిక, అందుబాటు ధర, ఆకట్టుకునే ఆకృతులు, ఆధునిక నగర ప్రణాళికలకు సంబంధించిన నూతన ఆలోచనలకు ఈ నగరం వేదికగా నిలవాలని చెప్పారు. తొలుత 61.77 ఎకరాలలో ట్రేడ్ సెంటర్‌గా దీన్ని నెలకొల్పుతామని, ఇప్పటికే 610 సంస్థలు ఇక్కడ తమ వ్యాపార కార్యకలాపాలను ఆరంభించడానికి ముందుకొచ్చాయని టిడ్కో ఎగ్జిక్యూటీవ్ వైస్ చైర్మన్ రామనాథ్ ముఖ్యమంత్రికి వివరించారు. కార్పొరేట్ కార్యాలయాలు, మూడంచెల ప్రదర్శనశాలలు, గిడ్డంగులు, గోడౌన్లు, భారీ నిర్మాణ యంత్ర పరికరాలు, ఫుడ్ ప్లాజా, పార్కింగ్ సదుపాయాలతో దీనిని త్వరలో ఏర్పాటు చేస్తామని రామనాథ్ తెలిపారు.
నీరుకొండలో ఎన్టీఆర్ మెమోరియల్ కమ్ మ్యూజియం ఆవరణలో ట్రాక్‌లెస్ టాయ్ ట్రైన్, కుటుంబ విరామ కేంద్రాలు, స్టార్ హోటళ్లు, రిసార్టులు, స్పోర్స్ట్-రిక్రియేషన్ క్లబ్బుల ఏర్పాటుకు వివిధ సంస్థల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయని అమరావతి డెవలప్‌మెంట్ అథారిటీ సీఎండీ లక్ష్మీ పార్ధసారధి చెప్పారు.
 డిసెంబర్ 15 నాటికి తాత్కాలిక హైకోర్టును సిద్ధం చేయాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇటీవల రెండు రోజులు ఎస్ఆర్ఎం వర్శిటీకి నీటి సరఫరాలో ఇబ్బందులు వచ్చినట్టు తమ దృష్టికి వచ్చిందని, ఎట్టి పరిస్థితులలో ఇది పునరావృతం కాకూడదని ముఖ్యమంత్రి సీఆర్‌డీఏ కమిషనర్‌కు చెప్పారు. నగరాల్లో రోడ్డు మీద నీరు నిలిచివుంటే సంబంధిత అధికారిని సస్పెండ్ చేసేలా కార్యాచరణలోకి దిగాలని పురపాలక అధికారులకు స్పష్టంచేశారు. పెను తుఫాన్లు వస్తేనే వైపరీత్యాలు అని అనుకోరాదని, రహదారిపై వర్షం నీరు పారే వ్యవస్థ సక్రమంగా లేకపోతే అది కూడా వైపరీత్య నిర్వహణగా తీసుకోవాలని హితవు పలికారు. ఎక్కడ రోడ్డు మీద నీరు కనిపించినా డిజాస్టర్ మేనెజ్మెంట్ సిబ్బంది అక్కడ వాలిపోవాలని చెప్పారు. వర్షాలు పడే సమయంలో పురపాలక శాఖ, అగ్నిమాపక శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో పురపాలక మంత్రి పి. నారాయణ, సీసీఎల్ఎ అనిల్ చంద్ర పునేటా, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, కార్యదర్శులు రాజమౌళి, గిరిజా శంకర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కన్నబాబు, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పాల్గొన్నారు.
print

Post Comment

You May Have Missed