డిసెంబర్ కు ఉదయసముద్రం పూర్తి చేయాలి – మంత్రి హరీశ్ రావు ఆదేశం
హైదరాబాద్ ఆగష్టు 29(ఎక్స్ ప్రెస్ న్యూస్): ఉదయసముద్రం ప్రాజెక్టు ను ఎట్టి పరిస్తితులలోనూ ఈ డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. 24 గంటలు పని చేస్తేనే ఉదయసముద్రం పూర్తవుతుందన్నారు. మంగళవారం ఇక్కడ జలసౌధ లో ఉదయసముద్రం పనులను ఆయన సమీక్షించారు. ఉదయసముద్రం ప్రాజెక్టు పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. స్పెషల్ డ్రైవ్ చేస్తేనే ఈ ప్రాజెక్టు పూర్తి వుతుందన్నారు. ప్రాజెక్టు ను పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని , 60 చెరువులను నింపాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.టార్గెట్ ప్రకారం పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ ఇంజనీర్లను, ఏజెన్సీ లను కోరారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లి పాకల రిజర్వాయర్ లకు చెందిన భూసేకరణ,నిర్మాణ పనుల పురోగతిని కూడా మంత్రి సమీక్షించారు. డిండి కి మొత్తం 9,800 ఎకరాలు అవసరం కాగా 5,000 ఎకరాలు సేకరించినట్టు అధికారులు తెలిపారు. రెండు వారాల్లో మిగతా భూసేకరణ ప్రక్రియ ను పూర్తి చేయాలని కోరారు. పెండ్లిపాకల రిజర్వాయర్ నిర్మాణంలో పెండింగులో ఉన్న భూసేకరణకు గానూ సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులు, ఎం.ఎల్.ఏలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు కోరారు. భూసేకరణ వేగవంతం కోసం ఇరిగేషన్ జె.ఈ ఒకరికి బాధ్యతలు ఇవ్వాలని అన్నారు.ప్రతి వారం జిల్లా కలెక్టర్,జాయింట్ కలెక్టర్ సమావేశాల్లో పాల్గొనాలని మంత్రి ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయడానికి రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకొని పని చేయాలని ఆదేశించారు.అయితే అవసరమైనంత మేరకే భూసేకరణ జరపాలని పక్కా ప్రణాళికతో భూములు సేకరించాలని కెనాల్స్ కోసం అవసరానికి మించి భూసేకరణ జరుగుతున్నట్టు మంత్రి హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.
ప్రాజెక్టుల భూసేకరణ, డిజైన్లు,తదితర పనులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీ.ఈ. సునీల్ ను ఆదేశించారు.నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఖమ్మం జిల్లాలో పూర్తయిన 19 లిఫ్ట్ పథకాల పరిస్థితి ని సమీక్షించి లక్ష ఎకరాలకు సాగునీరు అందేలా చూడాలని కోరారు. గత యేడాది ఎస్.ఆర్.ఎస్.పి పరిధిలో టెయిల్ టు హెడ్ విధానం సక్సెస్ అయినందున అదే పద్ధతిలో ఎన్.ఎస్.పి.కింద కూడా టెయిల్ టు హెడ్ ప్రయోగం అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి సబ్ డివిజన్ పరిధిలోనూ అమలు చేయాలని అన్నారు.
ఇరిగేషన్ ఈ. ఎన్. సి.మురళీధర్, ఈ.ఎన్. సి.(అడ్మిన్)నాగేందర్ రావు, సి.ఈ. సి.డి.ఓ. నరేందర్ రెడ్డి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు సి.ఈ. ఎస్.సునీల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.