టాటా గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకుంది. టాటా సన్స్ ఛైర్మన్ గా ఉన్న సైరస్ మిస్త్రీని హఠాత్తుగా ఆ బాధ్యతల నుంచి తప్పించింది. తాత్కాలిక ఛైర్మన్ గా మళ్లీ రతన్ టాటానే ఎంపిక చేసింది. సడెన్ గా టాటా గ్రూప్ ఈ నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యానికి గురిచేసింది. ఐతే, లాభాపేక్ష లేని కంపెనీలపై మిస్త్రీ ఆసక్తి చూపకపోవటం కారణంగానే ఆయనను ఈ పదవి నుంచి తొలగించినట్లు భావిస్తున్నారు.
టాటా గ్రూప్ కు నాలుగు నెలలలోగా కొత్త ఛైర్మన్ ను ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెలక్షన్ ప్యానెల్ ను ఎంపిక చేశారు. ఇందులో రతన్ టాటా, రోనెన్ సేన్, వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్ర, కుమార్ భట్టాచార్య సభ్యులుగా ఉన్నారు.
హఠాత్తుగా టాటా గ్రూప్ ఈ నిర్ణయం తీసుకోవటం మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది. దాదాపు 4 సంవత్సరాలుగా టాటా గ్రూప్ నకు సైరస్ మిస్త్రీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. రతన్ టాటా ఎంతో ఇష్టపడి సైరస్ మిస్త్రీకి ఈ బాధ్యతలు అప్పగించారు. టాటా కుటుంబానికి చెందిన వారు కాకపోయిన… సమర్థుడనే ఉద్దేశంతో రతన్ టాటా ఆయనపై నమ్మకం ఉంచారు. ఐతే, సైరస్ మిస్ర్తీ తొలగింపునకు స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ… 2014-15లో 108 బిలియన్ డాలర్ల టాటా టర్నోవర్ 2015-16లో భారీగా తగ్గింది. కేవలం 103 బిలియన్ డాలర్లకు పడిపోయింది. పైగా గతేడాది 23.4 బిలియన్ డాలర్లు ఉన్న రుణాలు ఈ ఏడాది 24.5 డాలర్లకు పెరిగాయి.
వీటికి తోడు లాభాపేక్ష లేని వ్యాపారాలపై మిస్త్రీ శ్రద్ధ వహించడం లేదని రతన్ టాటా భావించినట్లు తెలుస్తోంది. అలాంటి కంపెనీలను విక్రయించాలని మిస్త్రీ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా యూరోప్ లోని ఉక్కు వ్యాపారాలను విక్రయించారు. టాటా గ్రూప్ లో మొత్తంగా వందకు పైగా సంస్థలు ఉన్నాయి. వీటిలో లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్న సంస్థలు కూడా చాలానే ఉన్నాయి. వాటిని మిస్త్రీ అశ్రద్ధ చేయటం టాటా సన్స్ గ్రూప్ నకు అసంతృప్తి కలిగించింది. ఇక, సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.
రతన్ టాటా వారసునిగా సైరస్ మిస్త్రీ 2012లో ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తుల్లో టాటా లతో సంబంధం లేని రెండో వ్యక్తి సైరస్ మిస్త్రీ. 1932-38 మధ్య కాలంలో నౌరోజి సక్లట్ వాలా ఛైర్మన్ గా పనిచేశారు. టాటా సన్స్ సంస్థకు మిస్త్రీ ఆరో ఛైర్మన్. అంతకుముందు షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ ఎండీగా ఆయన బాధ్యతలు నిర్వహించారు.