శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు 16 సాయంకాలం ఆలయ ప్రాంగణం లోని వీరభద్రస్వామివారికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేషపూజలను నిర్వహించింది.
ఆలయప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికాగుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అఘోరవీరభద్రమూర్తి అని పేరు కూడా ఉంది. స్వామివారికి ప్రక్కనే దక్షప్రజాపతి కనిపిస్తాడు. ఈ స్వామిని పరివార ఆలయాలలో భాగంగా ప్రతినిత్యం పూజిస్తారు.
ప్రతి బుధవారం ప్రదోషకాలంలో విశేష అభిషేకం కార్యక్రమం దేవస్థానం నిర్వహిస్తోంది.
ఈ పూజవలన లోకశాంతి, దుర్భిక్షనివారణ, భక్తుల అనుకున్న కోరికలు నెరవేరుతాయని ,ముఖ్యంగా క్షేత్ర అభివృద్ధి జరుగుతుందని నమ్మకం.
ఈ పూజలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను జరిపారు.
తరువాత వీరభద్రస్వామికి పంచామృతాలతోనూ, పలురకాల ఫలోదకాలతోనూ, గంధోదకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, హరిద్రోదకంతోనూ , మల్లికా గుండంలోని శుద్ధజలంతో విశేష అభిషేకాన్ని నిర్వహించారు.
ఈ అభిషేకాల తరువాత విశేషంగా స్వామివారికి పుష్పార్చనను జరిపారు.