జూలై 5న శ్రీ అమ్మవారికి శాకంభరీ ఉత్సవం

 శ్రీశైల దేవస్థానం:  లోకకల్యాణం కోసం ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని జూలై 5వ తేదీన శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంభరీ ఉత్సవం జరుగుతుంది.ఈ ఉత్సవంలో శ్రీ అమ్మవారిని వివిధ రకాల కూరగాయాలతోనూ, ఆకుకూరలతోనూ , పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరిస్తారు.అదేవిధంగా అమ్మవారికి ఉత్సవ సంబంధి విశేషపూజలు నిర్వహిస్తారు.ఈ ఉత్సవంలో భాగంగానే శ్రీఅమ్మవారి ఉత్సవమూర్తికి, ఆలయప్రాంగణంలోని రాజరాజేశ్వరిదేవివారికి, సప్తమాతృకలకు, గ్రామదేవత అంకాళమ్మకు ప్రత్యేకపూజలు, శాకాలంకరణ చేస్తారు.ఈ విధంగా అమ్మవారిని శాకాలతో అర్చించడం వలన అతివృష్టి, అనావృష్టి నివారణ జరిగి , సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండుతాయని, కరువుకాటకాలు పోతాయని  పురాణాలు చెబుతాయి.

 పూర్వం హిరణ్యాక్షుని వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపశ్శక్తితో వేదాలను అంతర్జానం చేశాడు. దాంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. ఈ కారణంగా కరువుకాటకాలతో తీవ్రక్షామం ఏర్పడింది. అప్పుడు మహర్షులందరూ ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకు పరాశక్తి ప్రసన్నురాలై లోకరక్షణ కోసం దుర్గముడిని సంహరించి, వేదాలను రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరింపజేసింది.ఈ సందర్భంలోనే జగన్మాత తన నుండి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు ఫలాలు మొదలైన శాకాలను సృష్టించి,క్షామాన్ని నివారించింది. ఆ విధంగా అవతరించిన ఆ పరాశక్తి స్వరూపమే శాకంభరీదేవి. ఈ కారణంగానే ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారిని శాకాలతో అలంకరించి ఆర్చించే సంప్రదాయం ఏర్పడింది.

గురుపౌర్ణమి విశేషపూజలు ఆషాఢ పౌర్ణమిని గురుపౌర్ణమిగా ఆచరించడం మనసంప్రదాయం. ఈ కారణంగా జూలై 5 తేదీన ఆలయప్రాంగణంలోని హేమారెడ్డి మల్లమ్మమందిరం వద్ద శ్రీ దక్షిణామూర్తిస్వామివారికి,  వ్యాసమహర్షికి ప్రత్యేకపూజలు జరుగుతాయి.పరమశివుడే సర్వవిద్యలకు అధిదేవుడని వేదం చెబుతోంది. అందుకే పరమేశుని ఆదిగురువుగా స్తుతించడం జరుగుతోంది.ఆ పరమశివుని గురుస్వరూపమే దక్షిణామూర్తి రూపం. ఈ స్వామిని ధ్యానించడం వలన సకల విద్యలు లభిస్తాయని చెప్పబడుతోంది.

ఇక ఒకే రాశిగా ఉన్న వేదాన్ని నాలుగు విభాగాలుగా చేసి లోకాలకు అందించిన వ్యాసమహర్షి కారణజన్ముడు.వ్యాసమహర్షి అసలు పేరు ‘కృష్ణద్వైపాయనుడు’. వేదాలను నాలుగు విభాగాలుగా విభజించి లోకానికి అందించిన కారణంగా ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు ప్రసిద్ధమైంది.మంత్ర రూపంలో ఉన్న వేదాల  పరమార్థాన్ని గ్రహించలేని సామాన్యులకోసం వ్యాసమహర్షి మహాభారతాన్ని కూడా రచించాడు. అందువలననే మహాభారత గ్రంథం పంచమవేదంగా పేరొందింది.అదేవిధంగా లోకోద్ధరణ కోసం వ్యాసమహర్షి పురాణాలు కూడా రచించాడు. లోకంలో ఉండే ప్రతీ విషయాన్ని కూడా వ్యాసమహర్షి తన సాహిత్యంలో పేర్కొన్నాడు. అందుకే ఆయన చెప్పని విషయాలు ఏవీ లోకంలో కనబడవనే భావన ఎంతో ప్రసిద్ధం.

మహత్తర జ్ఞానసంపదను మనకు అందించిన వ్యాసమహర్షిని గురువుగా భావించి పూజించడం, స్మరించడం సంప్రదాయమైంది. ఈ కారణంగానే వ్యాసమహర్షి జన్మదినమైన ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమిగా ప్రసిద్ధమైంది.

print

Post Comment

You May Have Missed