×

జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా మొక్కలు నాటే కార్యక్రమం

జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా మొక్కలు నాటే కార్యక్రమం

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ, శరవేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ లో ఉన్న పచ్చదనం కాపాడుకోవటం, కొత్తగా మరింతగా మొక్కలు నాటడం అవసరం అన్నారు ముఖ్యమంత్రి ఓఎస్డీ (హరితహారం) ప్రియాంకవర్గీస్. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆమె నగరంలో విసృతంగా పర్యటించారు. గత సీజన్ లో నాటిన మొక్కలను చూడటంతో పాటు, ఈ సీజన్ హరితహారం కోసం ఖాళీ స్థలాలను పరిశీలించారు. మణికొండ, నెక్నాంపూర్ , ఎర్రగుంట చెరువులు, అల్కాపురి టౌన్ షిప్ ప్రాంతాల్లో అధికారుల బృందం పర్యటించింది. ఒకప్పుడు డంప్ యార్డులా మారి ఆ తర్వాత హరితహారంలో భాగంగా సుందరంగా తయారైన నెక్నాంపూర్ చెరువును పరిశీలించిన ప్రియాంక వర్గీస్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాగే రాజధాని పరిధిలో ఉన్న చెరువులు అన్ని మారాలని, హరితహారంలో భాగంగా చెరువు గట్లపై పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామని వెల్లడించారు. అలాగే హైదరాబాద్ పరిధిలో సుమారు 800 దాకా ఖాళీ స్థలాలు గుర్తించినట్లు వాటిల్లో హరితహారం చేపడతామన్నారు. ప్రభుత్వ ప్రయత్నానికి వ్యక్తులు, స్వచ్చంద సంస్థలు, కార్పోరేట్ కంపెనీలు కలిసిరావాలని, పచ్చదనం పెంపులో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ఆయా సంస్థలు సామాజిక బాధ్యతలో భాగంగా కొన్ని ప్రాంతాలను దత్తత తసుకుని పచ్చదనం పెంచాలని పిలుపునిచ్చారు. తాను కూడా స్వయంగా అల్కాపురి టౌన్ షిప్ బాధ్యత తీసుకుంటానని, భారీ స్థాయిలో ఉన్న టౌన్ షిప్ లో అదే స్థాయిలో పచ్చదనం కూడా పెంచుకోవాల్సి ఉందన్నారు. కాలనీ వాసులతో సమావేశమై పచ్చదనం పెంపుపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.  అల్కాపురి ఒక రోల్ మోడల్ గా ఉండాలని, అదే విధంగా నగరంలో ఉన్న అన్ని కాలనీలు, సంస్థలు తమ పరిధిలో ఉన్నంత మేరకు మొక్కలు నాటి వాటి రక్షణ బాధ్యతను ఏడాదంతా పర్యవేక్షించాలన్నారు. గ్రేటర్ పరిధిలో జోన్ల వారీగా ఖాళీ ప్రాంతాలను గుర్తించి, ప్రత్యేకంగా అధికారులకు పచ్చదనం బాధ్యతను అప్పగిస్తున్నామని, అదే విధంగా ప్రతీ పౌరుడూ తమ వంతు బాధ్యతగా హరితహారంలో పాల్గొని మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. విద్యార్థులు, స్కూళ్లు కూడా భాగస్వామ్యం తీసుకోవాలని తెలిపారు.

print

Post Comment

You May Have Missed