జీవో నెంబరు 59, జీవో నెంబరు 92 ద్వారా నిర్మాణాలు, ఖాళీ స్థలాల క్రమబద్దీకరణ కోసం డిమాండ్ నోటీసు అందుకున్న వారు చెల్లించాల్సిన సొమ్మును రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్ల ద్వారా కూడా చెల్లించే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితర అధికారులతో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శనివారం సమీక్ష జరిపారు. పెద్ద నోట్ల రద్దు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేయాల్సిన పనులన్నీ చేయాలని సిఎం ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ భూమలు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యుఎల్సి) భూముల్లో నిర్మాణాలు, ఖాళీ స్థలాల క్రమబద్దీకరణ కోసం చేసే చెల్లింపులకు ఈ నెల 14 వరకు రద్దయిన 500, 1000 నోట్లును కూడా తీసుకోవాలని సిఎం ఆదేశించారు. జీవో నెంబరు 59 ద్వారా ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలను, జీవో నెంబరు 92 ద్వారా యుఎల్సీ ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దరఖాస్తు చేసిన వారికి క్రమబద్దీకరించేందుకు అనుమతిస్తూ చెల్లించాల్సిన సొమ్ము ఎంతో కూడా దరఖాస్తు దారుడికి తెలుపుతూ రెవెన్యూ అధికారులు ఇప్పటికే డిమాండ్ నోటీసులు జారీ చేశారు. దీని ప్రకారం చేసే చెల్లింపులను రద్దయిన నోట్ల ద్వారా కూడా చేయవచ్చని ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ చెల్లింపులు ట్రెజరీల్లో చాలాన్లు కట్టడం ద్వారా చేయాల్సి ఉన్నందున ప్రభుత్వం ట్రెజరీలకు కూడా సమాచారం పంపింది.
ఆదివారం (13వ తేదీ)న కూడా బ్యాంకులు, ట్రెజరీలు తెరిచే ఉంటాయి కాబట్టి, ఆది, సోమవారాల్లో ట్రెజరీల ద్వారా ఈ చెల్లింపు అవకాశం వినియోగించుకోవాలని దరఖాస్తు దారులను ప్రభుత్వం కోరింది. చెల్లింపుకు సంబంధించిన చాలాన్లను సంబంధిత రెవెన్యూ అధికారులకు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. చాలాన్లు అందిన వెంటనే క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.